అలా ఎస్కేప్‌... ఇలా అరెస్టు! | - | Sakshi
Sakshi News home page

అలా ఎస్కేప్‌... ఇలా అరెస్టు!

May 2 2025 4:12 AM | Updated on May 2 2025 4:12 AM

అలా ఎస్కేప్‌... ఇలా అరెస్టు!

అలా ఎస్కేప్‌... ఇలా అరెస్టు!

సాక్షి, సిటీబ్యూరో: నగరంలో నమోదైన కేసులో వాంటెడ్‌గా ఉన్న నేరగాడిని పట్టుకోవడానికి సిటీ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు ఢిల్లీ వెళ్లారు. సాంకేతిక ఆధారాలతో నిందితుడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. కోర్టులో హాజరుపరిచి నగరానికి తీసుకువచ్చేందుకు తెలంగాణ భవన్‌లో ఉంచారు. అదను చూసుకున్న అతగాడు పోలీసుల నుంచి ఎస్కేప్‌ అయ్యాడు. హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు దీనిని సవాల్‌గా తీసుకున్నారు. ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసినప్పటికీ.. వారి సహాయం లేకుండానే 48 గంటల్లో పట్టుకున్నారు. గత నెలలో జరిగిన ఈ ఎపిసోడ్‌ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రాడ్‌లో నిందితుడిగా...

ఎస్సార్‌ నగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి (55) గత ఏడాది డిసెంబర్‌ 1న సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. ఆన్‌లైన్‌ ద్వారా తనకు ఎర వేసిన సైబర్‌ నేరగాళ్లు తాము చెప్పినట్లు ఇన్వెస్ట్‌మెంట్స్‌ చేస్తే భారీ లాభాలు ఉంటాయని చెప్పారని, వారి మాటలు నమ్మిన తాను తొలినాళ్లల్లో లాభపడినా చివరకు రూ.72.4 లక్షలు కోల్పోయానని అందులో పేర్కొన్నాడు. 2024 సెప్టెంబర్‌–నవంబర్‌ మధ్యలో ఆ స్కామ్‌ జరిగినట్లు పోలీసుల దృష్టికి తీసుకువెళ్లాడు. దీని ఆధారంగా కేసు నమోదు చేసుకున్న అధికారులు సాంకేతికంగా దర్యాప్తు చేపట్టారు. ఢిల్లీలోని జామియానగర్‌లో ఫుడ్‌ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్న మహ్మద్‌ ఉమర్‌, షహీన్‌బాగ్‌కు చెందిన విద్యార్థి ఇంతియాజ్‌ అహ్మద్‌ ఈ నేరంలో పాలుపంచుకున్నట్లు గుర్తించారు.

పీటీ వారెంట్‌ తీసుకున్నాక పరారీ...

ఈ నిందితులను అరెస్టు చేయడానికి సైబర్‌ క్రైమ్‌ ఠాణా ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.నరేష్‌ నేతృత్వంలోని బృందం గత నెల మూడో వారంలో ఢిల్లీ వెళ్లింది. ఏప్రిల్‌ 19న ఇద్దరు నిందితుల ఆచూకీ కనిపెట్టిన అధికారులు వారిని అరెస్టు చేశారు. మరుసటి రోజు అక్కడి సాకెట్‌లోని కోర్టులో హాజరుపరిచి హైదరాబాద్‌ తరలించడానికి ప్రిజనర్స్‌ ట్రాన్సిట్‌ (పీటీ) వారెంట్‌ తీసుకున్నారు. ఆ రోజు రైలు టిక్కెట్లు దొరక్కపోవడంతో మరుసటి రోజుకు (ఏప్రిల్‌ 21న) బుక్‌ చేసుకున్నారు. నిందితులిద్దరినీ తెలంగాణ భవన్‌కు తరలించిన పోలీసులు అక్కడి రూం నం.304లో బస చేశారు. అదే రోజు రాత్రి అదను చూసుకుని ఉమర్‌ పోలీసు కస్టడీ నుంచి పరారయ్యాడు. తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో కాలకృత్యాలు తీసుకోవడానికంటూ వెళ్లిన ఉమర్‌.. ఎస్కార్ట్‌ కానిస్టేబుల్‌ను తొసేసి పారిపోయాడు.

పట్టవదలకుండా గాలింపు

దీంతో అప్రమత్తమైన పోలీసులు అతడి కోసం గాలించినా ఫలితం లేకపోవడంతో తిలక్‌మార్గ్‌ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఉమర్‌పై మరో కేసు నమోదైంది. ఢిల్లీ ఠాణాలో కేసు నమోదైనప్పటికీ.. తమ కస్టడీ నుంచి పారిపోయిన నిందితుడిని తామే పట్టుకోవాలని నగర పోలీసులు భావించారు. హైదరాబాద్‌లో ఉన్న బృందం సాంకేతిక సహకారం అందించగా... ఢిల్లీలోని టీమ్‌ క్షేత్రస్థాయిలో గాలించింది. ఎట్టకేలకు 48 గంటల్లో ఉమర్‌ ఆచూకీ కనిపెట్టి పట్టుకోగలిగింది. ఆపై నగరానికి తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచి జ్యుడీషియల్‌ రిమాండ్‌కు తరలించారు. ఢిల్లీలోని తిలక్‌మార్గ్‌ ఠాణాలో నమోదైన కేసులో అక్కడి పోలీసులు త్వరలో పీటీ వారెంట్‌పై తరలించనున్నారు. ఉమర్‌, అహ్మద్‌ను ప్రధాన సూత్రధారులకు బ్యాంకు ఖాతాలు అందించడంలో కీలకంగా వ్యవహరించారని పోలీసులు చెబుతున్నారు.

ఢిల్లీలో సైబర్‌ నేరగాడిని పట్టుకున్న పోలీసులు

తెలంగాణ భవన్‌ నుంచి తప్పించుకున్న ఉమర్‌

సవాల్‌గా తీసుకున్న సిటీ సైబర్‌ క్రైమ్‌ కాప్స్‌

స్థానిక పోలీసుల సహకారం లేకుండానే పట్టివేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement