
లావణ్య ఇంటికి వచ్చిన రాజ్‌తరుణ్ తల్లిదండ్రులు
మణికొండ : మా కుమారుడి కష్టార్జితంతో నిర్మించుకున్న ఇంట్లో తామే ఉంటామని హీరో రాజ్‌తరుణ్ తల్లిదండ్రులు రాజేశ్వరి, బసవరాజు పేర్కొన్నారు. తమ ఇంట్లో లావణ్య అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతోందని, తమకు స్వంత ఇల్లు ఉండగా బయట అద్దెకు ఉండాల్సిన ఖర్మ తమకు లేదని వారు పేర్కొన్నారు.
బుధవారం నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని కోకాపేటలోని విల్లాలో రాజ్‌తరుణ్ తరఫు వ్యక్తులు, కేర్ టేకర్స్‌తో పాటు అతని తల్లిదండ్రులు వచ్చారు. తమ ఇంట్లో తాము ఉంటామని లోనికి వెళ్లే ప్రయత్నం చేశారు. దాంతో లావణ్య వారిని అడ్డుకున్నారు. తన ఇంటి సీసీ కెమెరాలను, ఇంట్లోని వస్తువులను ధ్వంసం చేసి తనపై దాడి చేశారని లావణ్య ఆరోపించారు. రాజ్‌తరుణ్‌తో తనకు జరిగిన వివాహంతో పాటు ఇంటి విషయం కోర్టులో ఉందని, కోర్టు ఆదేశాల ప్రకారమే తాను నడుచుకుంటానన్నారు. కాగా దీనిపై తమకు లావణ్య, రాజ్‌తరుణ్ తల్లిదండ్రులు ఎలాంటి ఫిర్యాదు ఇవ్వలేదని నార్సింగి పోలీసులు తెలిపారు.