
‘ఫ్యూచర్’కు ఫెన్సింగ్
● ఫార్మా భూ బాధిత గ్రామాల్లో మోహరించిన పోలీసులు
● సర్వే చేసి కంచె పనులు చేపట్టిన అధికారులు
● అడ్డుకునేందుకు యత్నించిన రైతులను
స్టేషన్‌కు తరలించిన సిబ్బంది
యాచారం: భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఫార్మాసిటీకి సేకరించిన భూములను గురువారం అధికారులు సర్వే చేసి చుట్టూ ఫెన్సింగ్ వేసే పనులు ప్రారంభించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మండల పరిధిలోని నక్కర్తమేడిపల్లి, నానక్‌నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో ఫార్మాసిటీ కోసం 7,640 ఎకరాల అసైన్డ్, పట్టా భూములను సేకరించారు. అప్పట్లో సేకరించిన కొన్ని సర్వే నంబర్లల్లోని భూముల చుట్టూ ఫెన్సింగ్ వేసి మిగిలిన భూములను వదిలేశారు. పరిహారం పొంది ఫార్మాసిటీకి భూములిచ్చిన రైతులు సదరు భూములకు ఫెన్సింగ్ లేకపోవడంతో నాలుగేళ్లుగా పంటలు సాగు చేసుకుంటున్నారు. ఫార్మాసిటీకి సేకరించిన భూముల్లోనే ప్రస్తుత ప్రభుత్వం ఫ్యూచర్‌సిటీ నిర్మాణానికి చర్యలు చేపట్టింది. ప్రముఖ సంస్థలకు భూములు అప్పగించే సమయంలో రైతులు కబ్జాలో ఉంటే కష్టతరమని భావించిన ప్రభుత్వం గురువారం యాచారం తహసీల్దార్ అయ్యప్ప, హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ సీఐ కృష్ణంరాజు ఆధ్వర్యంలో భూములను సర్వే చేసి ఫెన్సింగ్ వేసే పనులను ప్రారంభించారు. రైతులు ఆందోళన చేస్తారని ముందు జాగ్రత్తగా రాచకొండ సీపీ ఆదేశాల మేరకు భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు.
గ్రామాల చుట్టూ పోలీసు పహారా
నర్కర్తమేడిపల్లి గ్రామాన్ని పోలీసులు గురువారం ఉదయమే తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి, అడిషనల్ డీసీపీ సత్యనారాయణ, ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, మరో ఇద్దరు ఏసీపీలు, ఎనిమిది మంది సీఐలు, 15 మంది ఎస్‌ఐలు, 150 మందికి పైగా పోలీస్ సిబ్బంది, 40 మందికి పైగా టీజీఐఐసీ, రెవెన్యూ, సర్వే సిబ్బంది, 20కి పైగా జేసీబీలు, ఇతర యంత్రాలు, 50 మందికి పైగా కూలీలు సర్వే చేసే భూమి వద్దకు చేరుకున్నారు. అధికారులు సర్వే పనులు ప్రారంభించిన వెంటనే రైతులు అడ్డుకునేందుకు యత్నించారు. తమ అంగీకారం లేకుండానే పరిహారం డబ్బులు అథారిటీలో జమ చేశారని, కోర్టులో కేసులు నడుస్తున్నా సర్వే చేయడం, ఫెన్సింగ్ వేయడం సరికాదని పనులకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేయగా వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్‌కు తరలించారు. అనంతరం మాజీ సర్పంచ్‌లు పాశ్ఛ భాషా, శ్రీనివాస్‌రెడ్డి, మొరుగు రమేష్ తదితరులు తీవ్ర గందరగోళం సృష్టించడంతో వారిని సైతం అడ్డుకున్నారు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడం, రైతులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నక్కర్తమేడిపల్లి గ్రామంలోని సర్వే పనులను అడ్డుకోవడానికి నానక్‌నగర్, తాడిపర్తి, కుర్మిద్ద గ్రామాల నుంచి వస్తున్న రైతులను నియంత్రించేందుకు నక్కర్తమేడిపల్లి–నానక్‌నగర్, నక్కర్తమేడిపల్లి–సరికొండ రోడ్లపై పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.
ప్లాట్లకు కబ్జాలు చూపండి
ఫార్మాసిటీకి సేకరించిన భూములకు పరిహారం ఇచ్చారు. ప్లాట్ల పంపిణీ చేసి కబ్జాలు చూపేవరకు సర్వే, ఫెన్సింగ్ పనులు ఆపాలని రైతులు ఆందోళన చేపట్టారు. కలెక్టర్, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ ఇందుకు హామీ ఇవ్వాలని రైతులు పట్టుబట్టారు. విషయం తెలుసుకున్న ఆర్డీఓ అనంత్‌రెడ్డి ఘటనా స్థలానికి వచ్చిన వెంటనే రైతులు చుట్టుముట్టారు. మూడేళ్ల కింద ప్లాట్ల సర్టిఫికెట్లు ఇచ్చి నేటికి కబ్జా చూపించలేదు. ఫెన్సింగ్ వేసి మోసం చేస్తారా.. అంటూ నిలదీశారు. ఫార్మా ప్లాట్లకు లాటరీలు తీసి రిజిస్ట్రేషన్లు చేసి కబ్జాలు చూపిస్తామని హామీ ఇచ్చారు. కోర్టులో కేసులున్న భూములకు సర్వే చేసి, ఫెన్సింగ్ వేయమని హామీ ఇచ్చారు.
ఆ తర్వాత అంతా నిశ్శబ్ధం
ఆర్డీఓ అనంత్‌రెడ్డి, ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, గ్రీన్ ఫార్మాసిటీ సీఐ కృష్ణంరాజు రైతులతో మాట్లాడుతూ వారికి నచ్చజెబుతున్న సమయంలోనే ఫార్మాకు సేకరించిన భూముల చుట్టు సర్వే, ఫెన్సింగ్ పనులను చేపట్టారు. రైతులను అటుగా వెళ్లనీయకుండా కట్టడి చేశారు. కొందరు రైతులు రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ముదిరెడ్డి కోదండరెడ్డికి, ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డికి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి ఫిర్యాదు చేశారు. కోర్టు కేసులున్న భూములు, రైతుల వద్దకు వెళ్లవద్దని, పరిహారం పొందిన భూములనే సర్వే చేసి ఫెన్సింగ్ వేయాలని అధికారులకు సూచించారు. మధ్యాహ్నం వరకే రైతులు ఆందోళనలు, ధర్నాలు చేపట్టి ఆ తర్వాత అటు వైపు వెళ్లలేదు. దీంతో అధికారులు సాయంత్రం 6 గంటల వరకు సర్వే చేసి ఫెన్సింగ్ పనులు చేపట్టారు.

‘ఫ్యూచర్’కు ఫెన్సింగ్

‘ఫ్యూచర్’కు ఫెన్సింగ్