కటకట.. ఎక్కడెక్కడ? | - | Sakshi
Sakshi News home page

కటకట.. ఎక్కడెక్కడ?

Jan 23 2025 8:54 AM | Updated on Jan 23 2025 8:54 AM

కటకట.. ఎక్కడెక్కడ?

కటకట.. ఎక్కడెక్కడ?

తాగునీటి కొరతపై జలమండలి క్షేత్రస్థాయి సర్వే

సాక్షి, సిటీబ్యూరో: వచ్చే వేసవిలో తాగునీటి ఎద్దడిని అధిగమించేందుకు జలమండలి సిద్ధమవుతోంది. గత వేసవి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని పదిహేను రోజులుగా ముందస్తు ప్రణాళికల కోసం క్షేత్రస్థాయి సర్వే నిర్వహించింది. కోర్‌సిటీతో పాటు శివారులోని సమస్యాత్మక ప్రాంతాల్లో అధికారులు పర్యటించి పరిస్థితులను అంచనా వేశారు. ఎక్కడ.. ఏ మేరకు నీటి ఎద్దడి ఉంటుందో.. లోప్రెషర్‌తో పాటు ట్యాంకర్ల తాకిడి అధికంగా అవకాశాలుండే ప్రాంతాలను గుర్తించారు. సెక్షన్‌కు ఒక యూనిట్‌గా తీసుకొని సర్వే నివేదికల ఆధారంగా వేసవి కంటే ముందే ఫిబ్రవరి 15 వరకు సమస్య పరిష్కారం దిశగా చర్యలకు ఉపక్రమించేందుకు జలమండలి సిద్ధమవుతోంది.

ఆరు డివిజన్ల నుంచి ట్యాంకర్లకు డిమాండ్‌

నగరంలోని సుమారు ఆరు డివిజన్లలోనే ట్యాంకర్ల డిమాండ్‌ అధికంగా ఉంటుందని క్షేత్ర స్థాయి సర్వేలో వెల్లడైంది. మొత్తమ్మీద ఇప్పటికే 20 నుంచి 30 సెక్షన్లలో పరిధిలో భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో వేసవిలో ట్యాంకర్ల తాకిడి అధికంగా ఉంటుందని జలమండలి గుర్తించింది. సాధారణంగా మాదాపూర్‌, జూబ్లీహిల్స్‌, శేరిలింగంపల్లి, మణికొండ, హయత్‌నగర్‌, సరూర్‌నగర్‌, అత్తాపూర్‌ బంజారాహిల్స్‌, కొండాపూర్‌, గచ్చిబౌలి, మియాపూర్‌, కేపీహెచ్‌బీ, ప్రగతినగర్‌, నిజాంపేట తదితర ప్రాంతాల నుంచి ట్యాంకర్ల సరఫరాకు డిమాండ్‌ అధికంగా ఉండే అవకాశం ఉంటుందని సర్వేలో బహిర్గతమైంది. ఇప్పటికే ప్రగతి నగర్‌, వైశాలి నగర్‌, కొండాపూర్‌ తదితర ప్రాంతాలో ట్యాంకర్ల తాకిడి పెరిగింది.

వేసవిలో భారీ స్థాయిలోనే..

● సాధారణంగా వేసవిలో ట్యాంకర్ల డిమాండ్‌ భారీ స్థాయిలో ఉంటుంది. సగటున నెలవారీగా బుకింగ్‌ల సంఖ్య 1.50 లక్షల నుంచి 2.45 లక్షల వరకు చేరుతున్నాయి. ఈసారి కూడా అలాంటి సమస్య తలెత్తే ప్రమాదం ఉందని జలమండలి భావిస్తోంది. అవసరమైతే ఫిల్లింగ్‌ స్టేషన్లను పెంచడంతో పాటు ట్యాంకర్ల డెలివరీల్లో పెండెన్సీ లేకుండా సత్వర సరఫరా జరిగేలా తగిన ఏర్పాట్లకు చేయనుంది. ముఖ్యంగా వెయిటింగ్‌ పీరియడ్‌, పెండెన్సీ తగ్గించేలా ప్రణాళికలు రూపొందిస్తోంది. గతేడాది భూగర్భ జలాలు అడుగంటడంతో ఫిబ్రవరిలో ట్యాంకర్లకు డిమాండ్‌ పెరిగింది. ఏప్రిల్‌లో డిమాండ్‌ తారస్థాయికి చేరింది. దీంతో బుకింగ్‌.. సరఫరాకు మధ్య తీవ్ర కాలయాపన జరిగింది. ఈ సారి ఆ సమస్య తలెత్తకుండా.. తగిన ఏర్పాట్లు చేసేందుకు సంసిద్ధమవుతోంది. మరోవైపు గతంలో అధికంగా ట్యాంకర్లు బుక్‌ చేసిన వినియోగ దారులపై సర్వే నిర్వహించగా.. వారి ప్రాంగణాల్లో బోర్లు, భూగర్భ జలాలు ఎండిపోవడం వల్లే ఈ పరిస్థితి ఉత్పన్నమైనట్లు గుర్తించింది.

● ఉదాహరణకు ప్రస్తుతం తట్టిఖానా సెక్షన్‌లో 20 ట్యాంకర్లతో దాదాపు 150 ట్రిప్పుల వరకు ట్యాంకర్ల డెలివరీ జరుగుతోంది. ఇదే డిమాండ్‌ కొనసాగితే ఏప్రిల్‌ నాటికి రోజూ 400 ట్రిప్పులు పెరిగే అవకాశం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ఫిల్లింగ్‌ స్టేషన్‌లోని ఫిల్లింగ్‌ పాయింట్స్‌ నిర్మాణ పద్ధతి వల్ల ఒక ట్యాంకర్‌ నింపడానికి 15 నిమిషాలు పడుతుంది. ఫిల్లింగ్‌ సమయాన్ని 5 నిమిషాలకు తగ్గించుకుంటే అనుకున్నదాని కంటే రెట్టింపు ట్రిప్పులు సరఫరా చేయవచ్చని జలమండలి భావిస్తోంది.. దీంతో వెయిటింగ్‌ పీరియడ్‌, పెండెన్సీ తగ్గడంతో పాటు నగరవాసులకు సకాలంలో నీరు సరఫరా చేయవచ్చనే భావన జలమండలిలో వ్యక్తమవుతోంది.

ఎద్దడి ఉన్న బస్తీల గుర్తింపు

లోప్రెషర్‌ సరఫరాపై స్పష్టత

ట్యాంకర్ల తాకిడిపై దృష్టి

ముందస్తు ప్రణాళికతో వేసవి నీటి ఎద్దడికి చెక్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement