షో | - | Sakshi
Sakshi News home page

షో

Nov 25 2023 4:44 AM | Updated on Nov 25 2023 4:44 AM

- - Sakshi

ఫైనల్‌ టచ్‌
బీజేపీ అగ్రనేతలంతా ఇక్కడే మకాం

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌ నియోజకవర్గాలపై కమలనాథ్‌లు స్పెషల్‌ ఫోకస్‌పెట్టారు. వరుస పర్యటనలతో ఆ పార్టీ కేడర్‌లో జోష్‌ నింపుతున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ నగరానికి చేరుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వీరంతా సుడిగాలి పర్యటనలు చేశారు. రాజేంద్రనగర్‌ నియోజకవర్గం అభ్యర్థి తోకల శ్రీనివాసరెడ్డిని గెలిపించాల్సిందిగా కోరుతూ హైదర్షాకోట్‌లో.. శేరిలింగంపల్లి అభ్యర్థి రవికుమార్‌ యాదవ్‌ విజయం కోసం నిజాంపేట్‌ ఎక్స్‌రోడ్‌లో.. అంబర్‌పేట అభ్యర్థి కృష్ణ యాదవ్‌ తరపున ఆ నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించారు. ఇక రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సైతం మేడ్చల్‌, కంటోన్మెంట్‌ అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. మేడ్చల్‌ బీజేపీ అఽభ్యర్థి ఏనుగు సుదర్శన్‌రెడ్డికి మద్దతుగా నాగారం మున్సిపాలిటీ రాంపల్లిలో నిర్వహించిన సకలజనుల విజయ సంకల్ప సభలో రాజ్‌నాథ్‌ ప్రచారం చేశారు.

● ఇప్పటికే ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, కేంద్ర మంత్రులు స్మృతీ ఇరానీ, ప్రీయూష్‌ గోయల్‌ కూడా పలు నియోజకవర్గాల్లో పర్యటించారు. పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన ఓటర్లే లక్ష్యంగా వీరంతా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ అగ్రనేతలంతా బేగంపేటలోని హోటల్‌ ఐటీసీ కత్రియా వేదికగా మకాం వేసి, రోజుకు రెండు మూడు శివారు జిల్లాలతో పాటు సాయంత్రం నగరంలోని పలు నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. అభ్యర్థుల తరపున రోడ్‌షోలు, విజయ సంకల్ప సభలు నిర్వహిస్తున్నారు.

నేడు మహేశ్వరానికి ప్రధాని మోదీ..

ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్రమోడీ శనివారం నగరానికి చేరుకోనున్నారు. సాయంత్రం 5 గంటలకు తుక్కుగూడ వేదికగా నిర్వహించే ‘విజయ సంకల్ప సభ’లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఓఆర్‌ఆర్‌ సమీపంలో ఏర్పాటు చేసిన సభాస్థలికి మహేశ్వరం, రాజేంద్రనగర్‌, కల్వకుర్తి, ఇబ్రహీంపట్నం, ఎల్బీనగర్‌ నియోజకవర్గాల నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులను పెద్ద సంఖ్యలో తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీతో పాటు ఇతర ముఖ్య నేతలు కూడా సభకు హాజరు కానుండటంతో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే కేంద్ర భద్రతా బలగాలు సభాస్థలికి చేరుకుని, ఏర్పాట్లను పర్యవేక్షించాయి. ప్రధాని సభ నేపథ్యంలో సాయంత్రం శ్రీశైలం జాతీయ రహదారితో పాటు తుక్కుగూడ నుంచి శంషాబాద్‌ వైపు వెళ్లే ఓఆర్‌ఆర్‌ సర్వీసు రోడ్డుపై ఆంక్షలు విధించారు. వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. కాగా.. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ సైతం నగరానికి రానున్నట్లు సమాచారం.

ట్రాఫిక్‌ ఆంక్షలు

రాజేంద్రనగర్‌, శేరిలింగంపల్లి, అంబర్‌పేటలలో అమిత్‌షా

కీసర, కంటోన్మెంట్‌లలో రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌

ఇప్పటికే పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, మంత్రులు స్మృతీ ఇరానీ, పీయూష్‌గోయల్‌..

రేపు సైతం కొనసాగనున్న మోదీ పర్యటన

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శని, ఆదివారాల్లో నగరంలో పర్యటించనున్న నేపథ్యంలో ఆయా మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తూ ట్రాఫిక్‌ చీఫ్‌ జి.సుధీర్‌బాబు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. శనివారం సాయంత్రం 5.20 నుంచి 5.50 గంటల వరకు, ఆదివారం ఉదయం 10.35 నుంచి 11.05 గంటల వరకు బేగంపేట విమానాశ్రయం–రాజ్‌భవన్‌ మధ్య ఆంక్షలు అమలులో ఉంటాయి. వాహన చోదకులు వీటిని దృష్టిలో పెట్టుకుని సహకరించాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement