అమల్లోకి ఎన్నికల నియమావళి | - | Sakshi
Sakshi News home page

అమల్లోకి ఎన్నికల నియమావళి

Oct 10 2023 4:58 AM | Updated on Oct 10 2023 7:37 AM

సమావేశంలో రొనాల్డ్‌ రాస్‌, సీవీ ఆనంద్‌ తదితరులు - Sakshi

సమావేశంలో రొనాల్డ్‌ రాస్‌, సీవీ ఆనంద్‌ తదితరులు

హైదరాబాద్: ఎన్నికల షెడ్యూలు విడుదల కావడంతో సోమవారం మధ్యాహ్నం 12 గంటల నుంచే హైదరాబాద్‌ జిల్లాలో ఎన్నికల నియమావళి (కోడ్‌) అమల్లోకి వచ్చిందని హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ రొనాల్డ్‌ రాస్‌ తెలిపారు. కొత్త పనులు ప్రారంభించడం కుదరదని, ఇప్పటికే కొనసాగుతున్న పనులు మాత్రం ఆగవని స్పష్టం చేశారు. నగర పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌, జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ (ఎన్నికలు)జె.శంకరయ్యతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇప్పటి దాకా ఓటరు జాబితాలో పేరు లేని వారు అక్టోబర్‌ 30 వరకు నమోదు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. పోలింగ్‌ బూత్‌ల దాకా రాలేని 80 ఏళ్ల పైబడిన వృద్ధులు, వికలాంగులు సంబంధిత ఫారం ద్వారా దరఖాస్తు చేసుకుంటే పోలింగ్‌ సిబ్బంది వారి ఇళ్ల వద్దకే వెళ్లి పోలింగ్‌ నిర్వహిస్తారన్నారు. ఎన్నికల సంఘం ఈసారి ఈ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చిందన్నారు.

ఎన్నికల నిర్వహణకు తాము సిద్ధంగా ఉన్నామని రిటర్నింగ్‌ అధికారుల నియామకం, తదితర పనులు ఇప్పటికే పూర్తయ్యాయన్నారు. జిల్లాలో ఎలక్షన్‌ పాపులేషన్‌ రేషియో 744గా ఉందన్నారు. ప్రభుత్వ భవనాలపై ప్రచారం చేసేవారిపై డిఫేస్‌మెంట్‌ యాక్ట్‌ ప్రకారం చర్యలుంటాయని, ప్రైవేటు భవనాలకు సైతం యజమానుల అనుమతి అవసరమని స్పష్టం చేశారు. అనధికార ప్రకటనలన్నీ తొలగిస్తామన్నారు. మద్యం షాపుల వద్ద, ఆన్‌లైన్‌ నగదు ట్రాన్సాక్షన్లపై నిఘా ఉంటుందన్నారు. జాబితాలో పేరుందో లేదో రీచెక్‌ చేసుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

తెలియని వారు వెబ్‌సైట్‌లో ఉన్న బీఎల్‌ఓ నెంబర్‌కు ఫోన్‌ చేయడం ద్వారా కానీ, సంబంధిత అధికారుల సహకారంతో కానీ తెలుసుకోవాలని సూచించారు. కుటుంబంలోని అందరి ఓట్లు ఒకే కేంద్రంలో ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. పోలింగ్‌ కేంద్రం ఎక్కడ ఉంది, రూట్‌, అక్కడి ఓటర్ల క్యూ , పార్కింగ్‌ సదుపాయం తదితరమైనవన్నీ మై జీహెచ్‌ఎంసీ యాప్‌ ద్వారా ఆన్‌లైన్‌ ద్వారా తెలిసే ఏర్పాట్లు చేస్తామన్నారు. పోలింగ్‌ శాతం పెరిగేందుకు ఓటరు చైతన్య కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈవీఎంలు, తదితర సామాగ్రి సిద్ధంగా ఉందన్నారు.

సమస్యాత్మక కేంద్రాల వద్ద ప్రత్యేక చర్యలు: సీవీ ఆనంద్‌
సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద అదనపు సిబ్బందితో అవసరమైన చర్యలు తీసుకుంటామని సీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు. ఉచితాలపై నిఘా ఉంటుందన్నారు. ఈసారి కొత్తగా నార్కోటిక్‌ కంట్రోల్‌బ్యూరో కూడా పనిచేస్తుందన్నారు. లైసెన్సులేని ఆయుధాల గుర్తింపునకు స్పెషల్‌డ్రైవ్‌ చేపట్టడంతో పాటు ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు లైసెన్సులున్న వారు డిపాజిట్‌ చేసేలా చేయడం..ఇతరత్రా అంశాలకు సంబంధించి అన్ని చర్యలు తీసుకుంటామన్నారు.

ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌ పనిచేస్తాయని, తనిఖీలు విస్తృతంగా ఉంటాయని, ప్రజలు సహకరించాలన్నారు. అత్యవసర పనులకు డబ్బు తరలింపు సందర్భాల్లో అవసరమైన దస్త్రాలు తప్పకుండా వెంట ఉండాలని సూచించారు. యూపీఏ ట్రాన్సాక్షన్లు అనుమానాస్పదంగా ఉంటే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. విలేకరుల సమావేశంలో ఈవీడీఎం డైరెక్టర్‌ ప్రకాశ్‌రెడ్డి పాల్గొన్నారు.

జిల్లాలో పోలింగ్‌ కేంద్రాలు: 3,986

పోలింగ్‌, పోలీస్‌ సిబ్బంది: 34,452

ఇంటిగ్రేటెడ్‌ చెక్‌పోస్టులు :18

ఎన్నికల సంబంధిత ఫిర్యాదులకు జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంతోపాటు 15 ఆర్‌ఓల కార్యాలయాల్లో కంట్రోల్‌రూమ్స్‌ ఏర్పాటు

సీ–విజిల్‌ యాప్‌ అందుబాటులోకి

రాజకీయపార్టీలకు ఎన్నికల సంబంధిత అనుమతులకు సింగిల్‌విండోగా జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో సువిధ కేంద్రం ఏర్పాటు.

ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై ఫిర్యాదులు, ఖర్చులు, మద్యం, పెద్ద మొత్తంలో నగదు తరలింపు, తదితరమైన వాటి పరిశీలనకు 90 ఫ్లయింగ్‌ స్క్వాడ్స్‌, రాజకీయపార్టీల ర్యాలీలు, తదితరమైనవి చిత్రీకరించేందుక 15 చొప్పున వీడియో సర్వైలెన్స్‌, వీడియో వ్యూయింగ్‌ టీమ్స్‌ ఏర్పాటు.

నిబంధనలకు వ్యతిరేకంగా ఎన్నికల సామాగ్రి ప్రచురించే సంస్థలపై చర్యలు.

నగరంలో గుర్తించిన సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాలు:1587

టోల్‌ ఫ్రీ నెంబర్లు

1950, 1800–599–2999

నియమావళి ఉల్లంఘనల ఫిర్యాదులను సీ–విజిల్‌ యాప్‌ ద్వారా పంపితే వంద నిమిషాల్లో పరిష్కరించి తెలియజేస్తారు.

బందోబస్తు విధుల కోసం 32 కంపెనీల కేంద్ర బలగాలను కోరినట్లు పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement