
హైదరాబాద్: షాపింగ్ చేసేందుకు స్మార్ట్ బజార్‌కు వెళ్లిన ముగ్గురు లిఫ్ట్ వైరు తెగడంతో కింద పడటంతో తీవ్రంగా గాయపడిన సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ రాంనారాయణ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దూలపల్లి ప్రాంతానికి చెందిన దేవరకొండ శివ తన సోదరి కీర్తనతో పాటు స్నేహితురాలు సునయనతో కలిసి దూలపల్లిలోని ఏఎంఆర్ కాంప్లెక్స్‌లోని స్మార్ట్ బజార్ వెళ్లారు.
మూడో అంతస్తులోని విలేజ్‌మండీకి వెళ్లేందుకు లిఫ్ట్ ఎక్కారు. మూడవ అంతస్తులోకి వెళ్లే సమయంలో ఒక్కసారిగా లిఫ్ట్ వైరు తెగి కింద పడింది. ఈ ఘటనలో కీర్తన, సునయనలకు కాళ్లు విరగడంతో శివకు నడుం విరిగింది. స్థానికులు వారిని సూరారం నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. శివ తండ్రి భిక్షపతి ఫిర్యాదు మేరకు పోలీసులు భవన యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లిఫ్ట్ పని చేస్తూ ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి
మాదాపూర్: నిర్మాణంలో ఉన్న భవనంలో లిఫ్ట్ వర్క్ చేస్తూ ప్రమాదవశాత్తు కింద పడటంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం మాదాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇజ్జత్ నగర్‌లో చోటు చేసుకుంది.
ఇన్‌స్పెక్టర్ తిరుపతి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గద్వాల్ జిల్లాకు చెందిన వడ్డెర క్రిష్ణ బతుకుదెరువు నిమిత్తం నగరానికి వలసవచ్చాడు. బుధవారం మధ్యాహ్నం అతను భార్య కవితతో కలిసి నిర్మాణంలో ఉన్న భవనం లిఫ్ట్ వర్క్ చేస్తుండగా ప్రమాదవశాత్తు 5వ ఫ్లోర్ నుంచి ఇద్దరూ కింద పడ్డారు. ఈ ఘటనలో క్రిష్ణ అక్కడికక్కడే మృతి చెందగా, అతడి భార్య కవిత గాయాలతో బయటపడింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.