తిరుపతి, దామోదర్‌లలో ఒకరని ప్రచారం
ఇప్పటికే బర్సె దేవా లొంగుబాటు వార్త హల్‌చల్
తెలంగాణలో తలదాచుకుంటున్న మావోయిస్టులు?
యూట్యూబర్ ద్వారా మొదలైన చర్చలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: సీపీఐ (మావోయిస్టు) బెటాలియన్ నంబర్ వన్ కమాండర్ బర్సె దేవా లొంగుబాటు వార్తలు హల్‌చల్ చేస్తుండగానే, మరో అగ్రనేత సైతం లొంగుబాటలో ఉన్నారనే అంశం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు ఓ యూట్యూబ్ చానల్ నిర్వాహకుడి ద్వారా ప్రయత్నాలు జరుగుతున్నట్టు సమాచారం. గతేడాది మే 21న మావోయిస్టు పార్టీ చీఫ్ సెక్రటరీ నంబాల మరణం తర్వాత కీలక మావోయిస్టు నేతలు దండకారణ్యం వదిలిపెట్టారు. దండకారణ్యం చుట్టూ విస్తరించిన తెలంగాణ, ఏపీ, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, జార్ఖండ్ రాష్ట్రాల్లో అగ్రనేతలు రహస్య జీవితం గడుపుతున్నట్టు తెలుస్తోంది.
నవంబర్‌లో హిడ్మా ఏపీలో ఎన్‌కౌంటర్ కావడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. అప్పటి నుంచి తెలంగాణ–ఛత్తీస్‌గఢ్‌తో సరిహద్దులు పంచుకుంటున్న ములుగు, భద్రాద్రి కొత్తగూడెంతోపాటు కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లాల అడవుల్లో మావోయిస్టు కీలక నేతలు తలదాచుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇందుకు తగ్గట్టే తెలంగాణలో షెల్ట ర్ తీసుకున్న ఓ కీలక నేత తన అభిప్రాయాలు, డిమాండ్లను బాహ్య ప్రపంచానికి తెలిపేందుకు ఓ యూట్యూబర్‌ను తమ స్థావరానికి పిలిపించారని సమాచారం. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని సదరు యూ ట్యూబర్ శుక్రవారం రాత్రి 10 గంటల సమయాన తన చానల్ ద్వారా వివరాలు వెల్లడించారు.
ఎవరా నేత ?
హిడ్మా ఎన్‌కౌంటర్ తర్వాత మావోయిస్టు పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి పోలీసుల అదుపులో ఉన్నట్టు రెండు వారాల పాటు ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయన క్షేమంగానే ఉన్నాడని పార్టీ ప్రకటించింది. అప్పటి నుంచి జార్ఖండ్‌లోని ఓ రహస్య ప్రాంతంలో తిరుపతి ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే, శాంతిచర్చలు–లొంగుబాట్ల సమయంలో కీలక సమాచారం బయటి ప్రపంచానికి తెలిపిన యూట్యూబర్ ఇప్పుడు తెలంగాణలో కీలక నేతను కలుసుకునేందుకు వచ్చినట్టు ప్రకటించడంతో ఆ కీలక నేత తిరుపతేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
తిరుపతి కానీ పక్షంలో తెలంగాణ రాష్ట్ర కమిటీకి నేతృత్వం వహిస్తున్న దామోదర్ అయి ఉండే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. వీరిద్దరు కాకపోతే లొంగుబాటుకు ముందే బర్సె దేవా తన సేఫ్టీ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూ కూడా అయి ఉండొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణలో తలదాచుకుంటున్న సదరు కీలక నేత ఎవరనే అంశం ఒకటి, రెండు రోజుల్లో వెల్లడయ్యే అవకాశముంది.
సంధానకర్తలుగా
గతేడాది ఏప్రిల్‌లో శాంతిచర్చల ప్రక్రియ తెరపైకి వచ్చినప్పుడు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న ‘బస్తర్ టాకీస్’అనే యూట్యూబ్ చానల్‌కు ఇంటరూయ్వ ఇచ్చారు. ఆ తర్వాత 210 మంది కేడర్‌తో ఆయుధాలతో సహా ఆయన లొంగిపోయారు. ఇటీవల ఎంఎంసీ జోనల్ సభ్యుడు అనంత్ మరో యూట్యూబ్ చానల్ ద్వారా లొంగిపోయిన విషయం తెలిసిందే. ఆపరేషన్ కగార్ మొదలయ్యాక ఇంటర్నెట్ యాక్సెస్ కీలకంగా మారింది.
దీంతో ఇటు పోలీసులు, అటు మావోయిస్టులకు అనుసంధానకర్తలుగా యూట్యూబ్ చానళ్లు మారినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బస్తర్ టాకీస్‌కు చెందిన వికాస్ తివారి.. తెలంగాణలోకి వచ్చారు. దట్టమైన అడవిలో ఓ రహస్య ప్రాంతంలో మావోయిస్టు అగ్రనేతతో సమావేశమయ్యారు. మార్గమధ్యలో బెటాలియన్ వన్ కమాండర్ బర్సె దేవా తన జంబో టీమ్‌తో బస చేసిన ప్రాంతం, వంటలు చేసుకున్న ప్రదేశాలను వీడియోలో చూపించాడు. వారు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి వెళ్లిన మూడు రోజుల తర్వాత ఆ ప్రదేశాన్ని మావోయిస్టులు బహిర్గతం చేశారు.


