సంక్రాంతికి ముందు లేదా తర్వాత షెడ్యూల్ ప్రకటన
రాష్ట్ర ఎన్నికల సంఘానికి సర్కార్ గ్రీన్‌సిగ్నల్!
17 లేదా 18వ తేదీన విదేశాలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ఫిబ్రవరి 1న తిరిగి రాక
3న జడ్చర్లలో ట్రిపుల్ ఐటీకి శంకుస్థాపన చేయనున్న సీఎం
ఆ తర్వాత జిల్లాల టూర్.. రెండేళ్లలో టచ్ చేయని గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే యోచన
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల దిశలో అడుగులు వడివడిగా పడుతున్నాయి. ఈ నెలలోనే ఎన్నికలకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలని, ఫిబ్రవరిలో ఈ ఎన్నికలను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సంక్రాంతికి ముందు లేదంటే ఆ తర్వా త కచి్చతంగా షెడ్యూల్ ప్రకటించి ఆ వెనువెంటనే నోటిఫికేషన్ ఇవ్వడానికి రాష్ట్ర ఎన్నికల సంఘానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచి్చనట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ నెల 11న లేదంటే 20న షెడ్యూల్ ప్రకటించే అవకాశా లున్నాయి. ఫిబ్రవరి రెండు లేదా మూడో వారంలోగా ఎన్నికల తతంగాన్ని పూర్తి చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించింది.
డబ్ల్యూఈఎఫ్ సమావేశాలకు సీఎం..
జనవరిలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనకు వెళుతున్నారు. స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలు ఈనెల 19 నుంచి 23 వరకు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో పాల్గొనేందుకు 17 లేదా 18న సీఎం రేవంత్ బయలుదేరతారని తెలుస్తోంది. దావోస్‌లో వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో జరిగే సమావేశాల తర్వాత ఆయన అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు.
ఈ పర్యటనను కూడా ముగించుకుని ఫిబ్రవరి 1న హైదరాబాద్‌కు వస్తారని, 3న జడ్చర్లకు వెళ్తారని ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాల ద్వారా తెలిసింది. ఫిబ్రవరి 3న జడ్చర్లలో ఆయన ట్రిపుల్ ఐటీ నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత పలు జిల్లాల్లో పర్యటిస్తారు. గత రెండేళ్లలో ఆయన ఎక్కడెక్కడ పర్యటించారన్న దానిపై సీఎంవో వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. ఈ దఫా జిల్లాల పర్యటనలో గతంలో వెళ్లని గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారని, ఈ మేర కు షెడ్యూల్ తయారవుతోందని సమాచారం.
స్థానిక ఎన్నికలు పూర్తి చేస్తేనే..
15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు రావాలంటే.. స్థానిక సంస్థలకు ఎన్నికలు పూర్తి చేయాలి. అప్పుడే కేంద్రం గ్రాంట్లు విడుదల చేసేందుకు సాధ్యమవుతుంది. దాదాపు రూ.500 కోట్ల ని ధులు రాకుండా ఆగిపోయిన నేపథ్యంలో ము న్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న జీహెచ్‌ఎంసీ పాలక మండలి గడువు ఫిబ్రవరి 10వ తేదీతో ముగియనుంది. ఆ తర్వాత ఈ కార్పొరేషన్‌ను మూడు కార్పొరేషన్లుగా విభజించనున్నట్లు తెలిసింది. అనంతరం 300 వార్డులను ఈ మూడు కార్పొరేషన్లకు సర్దుబాటు చేసిన అనంతరం ఓటర్ల జాబితాను ప్రకటించి...ఎన్నికలు వచ్చే మే లేదా జూన్‌లో నిర్వహించే అవ కాశం ఉన్నట్లు అధికారవర్గాలు తెలిపాయి.


