‘అన్నా.. అమ్మానాన్నను బాగా చూసుకో’ | Sakshi
Sakshi News home page

‘అన్నా.. అమ్మానాన్నను బాగా చూసుకో’

Published Tue, Jun 6 2023 11:01 AM

- - Sakshi

హైదరాబాద్: రెండు సెల్‌ఫోన్లు పోయాయనే బెంగ. మరో ఫోన్‌ కోసం నాన్నకు భారం కావద్దన్న ఆవేదన.. ఆ యువకుణ్ని ఆత్మహత్యకు పాల్పడేలా చేసింది. ‘అన్నా.. అమ్మానాన్నను బాగా చూసుకో’ అంటూ సోదరుడికి ఫోన్‌ చేసి బలవర్మరణం చెందిన ఘటన విషాదాన్ని నింపింది. మృతుడి కుటుంబ సభ్యులు, పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. బోరబండ రాజ్‌నగర్‌కు చెందిన చుక్కా శ్రీనివాస్‌ పంజగుట్ట నిమ్స్‌మేలో పని చేస్తున్నారు. ఆయన రెండో కుమారుడు సాయికుమార్‌ (21) నగరంలోని ఓ కాలేజీలో బీకాం కంప్యూటర్స్‌ చదువుతూనే పార్ట్‌ టైమ్‌లో డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు.

నెల రోజుల క్రితం సాయికుమార్‌ తన సెల్‌ఫోన్‌ను పోగొట్టుకున్నాడు. విషయం తెలుసుకున్న తండ్రి శ్రీనివాస్‌ కుమారుడికి ‘ఈఎంఐ’ పద్ధతిలో రూ.28 వేల విలువ చేసే మరో సెల్‌ఫోన్‌ కొనిచ్చాడు. గత శుక్రవారం ఆ ఫోన్‌ సైతం పోయింది. దీంతో సాయికుమార్‌ లోలోపల కుమిలిపోయాడు. శనివారం బోరబండ పీఎస్‌లో ఫిర్యాదు చేశాడు. అదే రోజు అతడు ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. సాయంత్రం పాదచారుల ఫోన్‌ ద్వారా తన సోదరుడు వినోద్‌కుమార్‌కు ఫోన్‌ చేశాడు.

తాను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. అమ్మా నాన్నను నువ్వే బాగా చూసుకోవాలని చెప్పి ఫోన్‌ పెట్టేశాడు. ఆందోళన చెందిన బంధువులు నగరంలోని అన్ని పోలీస్‌ స్టేషన్లతో పాటు సికింద్రాబాద్‌ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరుసటి రోజు తుకారం గేటు వద్ద పట్టాలపై ఓ యువకుడి మృతదేహాన్ని గుర్తించిన రైల్వే పోలీసులు శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అక్కడికి వెళ్లిన శ్రీనివాస్‌ కుటుంబ సభ్యులు మృతదేహం తమ కుమారుడు సాయికుమార్‌దేనని గుర్తించి కన్నీరు మున్నీరయ్యారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
 
Advertisement