కాళేశ్వరం: జయశంకర్‌భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం ప్రాజెక్టులో ప్రధాన భాగమైన కన్నెపల్లిలోని లక్ష్మీ పంపుహౌస్ సమీప గోదావరి నీటి ప్రవాహాన్ని పరిశీలించేందుకు శనివారం హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు చెందిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం రానుంది. బృందం సభ్యులు ఉదయం 11 గంటలకు కన్నెపల్లికి కాన్వాయ్‌ల్లో చేరుకుంటారని బీఆర్‌ఎస్ వర్గాలు శుక్రవారం తెలిపాయి. కాగా, మొదట మేడిగడ్డ బరాజ్ సందర్శన ఉండగా పర్యటనను కన్నెపల్లికి మార్చారు. మహారాష్ట్ర నుంచి వచ్చే ప్రాణహిత నీటిలభ్యతతో దిగువకు ప్రవహిస్తున్న జలాలను కన్నెపల్లి పంపుహౌస్‌లోని మోటార్ల నుంచి ఎత్తిపోసి సాగు, తాగునీటి అవసరాలకు వినియోగించాలనే లక్ష్యంతో ఈ పర్యటన సాగనుంది. రాష్ట్రంలో సూపర్ ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో నీటి కొరత ఏర్పడే అవకాశాల నేపథ్యంలో గోదావరి నీటిని సమర్థవంతంగా వినియోగించుకోవాల్సిన అవసరాన్ని బీఆర్‌ఎస్ నేతలు ప్రస్తావించనున్నట్లు తెలిసింది. ఈ కన్నెపల్లి పర్యటనకు బీఆర్‌ఎస్‌పార్టీ ఎమ్మెల్యేలు తలసాని శ్రీనివాస్‌యాద్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, పద్మారావు, కేపీ వివేకానంద్, మాధవరం కృష్ణారావు, సబితా ఇంద్రారెడ్డి, బండారి లక్ష్మారెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు శంబీపూర్ రాజు, దాసోజు శ్రావణ్, సురభి వాణిదేవిలతో పాటు భూపాలపల్లి, మంథని మాజీ ఎమ్మెల్యేలు గండ్ర వెంకటరమణారెడ్డి, పుట్ట మధు, పలువురు సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొంటారని మహదేవపూర్ మండల పార్టీ అధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాసరావు తెలిపారు.
నీట మునిగి పంచాయతీ కార్యదర్శి మృతి
● కాపాడబోయిన భార్యకు గాయాలు
● ఓడేడు మానేరు తీరంలో ఘటన
ముత్తారం/మంథనిరూరల్: దసరా పండుగకు అత్తగారింటికి వెళ్లి తిరుగు ప్రయాణంలో సరదాగా మానేరులోకి దిగిన పంచాయతీ కార్యదర్శి నీట మునిగి మృతిచెందాడు. కాపాడబోయిన భార్య తీవ్రగాయాలతో బయటపడింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం రత్నపూర్ గ్రామానికి చెందిన శనిగరపు జయపాల్(32) పంచాయతీ కార్యదర్శి. దసరా పండుగ కోసం భార్య శ్రుతి, పాపతో కలిసి కారులో అత్తగారి ఊరైన జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్లకు వెళ్లారు. శుక్రవారం తిరుగు ప్రయాణంలో ఓడేడు మానేరు తీరంలో సరదాగా జయపాల్ నీటిలోకి దిగాడు. అయితే నేషనల్ హై వే కోసం పోసిన తాత్కాలిక మట్టిరోడ్డు ఇటీవల కురిసిన భారీవర్షానికి కొట్టుకుపోయి పెద్దగొయ్యి ఏర్పడింది. ఈ విషయం తెలియకుండా నీటిలోకి దిగిన జయపాల్.. ప్రమాదవశాత్తు అందులో మునిగి మృతి చెందారు. నీట మునిగిపోతున్న భర్తను కాపాడేందుకు ప్రయత్నించిన భార్య శ్రుతి సైతం నీటిలో మునుగుతుండగా అక్కడే ఉన్న ఈశ్వర్ అనే వ్యక్తి కాపాడాడు. అపస్మారస్థితిలోకి వెళ్లిన శ్రుతిని గోదావరిఖని ఆస్పత్రికి తరలించారు. శ్రుతి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు స్థానికులు తెలిపారు. కళ్లెదుటే తండ్రి చనిపోయి.. అమ్మ నీట మునుగుతుండగా చూసిన తమ పాప కన్నీరుమున్నీరుగా విలపించింది. జయపాల్ గతంలో ముత్తారం మండలం పోతారం పంచాయతీ కార్యదర్శిగా కూడా పనిచేశారు. ప్రస్తుతం మంథని మండలం సూరయ్యపల్లిలో విధులు నిర్వర్తిస్తున్నారు. ఎస్సై రవికుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.


