హన్మకొండ అర్బన్: పట్టణ ప్రజలకు పైపుల ద్వారా వంట గ్యాస్ సరఫరా చేసేందుకు అవసరమైన అనుమతులను సంబంధిత శాఖల అధికారులు త్వరగా మంజూరు చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో మేఘా సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థల ప్రతినిధులు, వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. పట్టణంలో భూగర్భ గ్యాస్ పైప్‌లైన్ల నిర్మాణం, గ్యాస్ సరఫరా, వివిధ శాఖల నుంచి రావాల్సిన అనుమతులపై సమీక్షించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.రవి, వివిధ శాఖల అధికారులు మహేందర్, నవీన్ కుమార్, నరసింహారావు, లింగయ్య, దేవిక చౌహన్, లక్ష్మీ రమాకాంత్, గంగారెడ్డి, మేఘా సంస్థ ప్రతినిధులు హరి, ఎస్‌కే రషీద్, పెట్రోలియం సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
పనులు వేగవంతం చేయండి..
హనుమకొండ జిల్లాలో గ్రామ సమాఖ్య భవనాల నిర్మాణ పనులు వేగవంతం చేసి, త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లో వీబీ జీ రాంజీ, స్వచ్ఛ భారత్ మిషన్, గ్రామ సమాఖ్య భవనాల నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఆయా పథకాల అమలు తీరు, చేపట్టిన పనుల పురోగతి, పారిశుద్ధ్య కార్యక్రమాలు, గ్రామ సమాఖ్య భవనాల నిర్మాణ స్థితిగతులు, అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులపై సమీక్షించారు. స్థానిక సంస్థల ఇన్‌చార్జ్ అదనపు కలెక్టర్ బి.శేషాద్రి, డీఆర్డీఓ మేన శ్రీను, డీపీఓ లక్ష్మీ రమాకాంత్, జిల్లా పంచాయతీరాజ్ శాఖ ఈఈ రాజ్‌గోపాల్‌రావు, అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి లక్ష్మీ ప్రసన్న, అధికారులు పాల్గొన్నారు.
హనుమకొండ కలెక్టర్ చాహత్
అధికారులతో సమావేశం


