కుడా.. పంచతంత్రం! | - | Sakshi
Sakshi News home page

కుడా.. పంచతంత్రం!

Oct 24 2026 10:20 AM | Updated on Oct 24 2026 10:20 AM

కుడా.. పంచతంత్రం!

కోట చుట్టూ మోటు.. పర్యాటకానికి ఊపు

నిధుల కేటాయింపు ఇలా..

సీఎం రేవంత్‌ రెడ్డికి ‘కుడా’ చైర్‌పర్సన్‌ కృతజ్ఞతలు

వరంగల్‌ నగరాభివృద్ధిలోని ఐదు ప్రాజెక్టులకు నిధుల వెల్లువ

సాక్షి, వరంగల్‌: కాకతీయుల చారిత్రక వైభవాన్ని చాటే వరంగల్‌ నగరానికి ఆధునిక హంగులు అద్దేందుకు నిధులు కేటాయించారు. ఖిలా వరంగల్‌ కోటలో ఇన్నర్‌, మిడిల్‌ మోటు, వరంగల్‌ ఇంటిగ్రేటెడ్‌ బస్‌ టెర్మినల్‌, కమర్షియల్‌ కాంప్లెక్స్‌, కాకతీయ మ్యూజికల్‌ గార్డెన్‌, హనుమకొండలో సెంట్రల్‌ ప్లాజా, వేయి స్తంభాల ఆలయ పరిసరాల్లో పార్కింగ్‌, లైటింగ్‌, గ్రీనరీకి కలిపి రూ.382 కోట్లను కాకతీయ అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (కుడా)కి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులు ప్రపంచబ్యాంకు నుంచి రుణంగా తీసుకుంది. ఇప్పటికే వరంగల్‌ బస్‌ టెర్మినల్‌ పనులు ప్రారంభమవ్వగా, ఇతర ప్రాజెక్టులకు రెండు నుంచి మూడు నెలల్లో టెండర్లు పిలిచి అప్పటినుంచి మూడేళ్లలోపు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.

స్పీడందుకోనున్న ‘బస్‌ టెర్మినల్‌’

వరంగల్‌ నగరంలో ఆధునిక బస్‌ టెర్మినల్‌ నిర్మాణ పనులకు నిధుల కొరత అడ్డంకిగా మారింది. గత రెండేళ్లుగా పనులు మందకొడిగా సాగుతున్న నేపథ్యంలో అర్బన్‌ ఛాలెంజ్‌ ఫండ్‌ (యూసీఎఫ్‌) ద్వారా సుమారు రూ.125 కోట్లు రావడంతో ఈ పనులు స్పీడందుకోనున్నాయి. రెండు బేస్‌మెంట్‌ ఫ్లోర్లతో పాటు బస్‌ టెర్మినల్‌ నిర్మాణాన్ని 2027, ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని ‘కుడా’ అధికారులు అంటున్నారు. ఆ తర్వాత ఐదు అంతస్తుల కమర్షియల్‌ భవన నిర్మాణాన్ని వేగవంతం చేసి అందుబాటులోకి తీసుకురానున్నారు.

మ్యూజికల్‌ గార్డెన్‌ సుందరీకరణ..

వరంగల్‌లోని కాకతీయ మ్యూజికల్‌ గార్డెన్‌ను పర్యాటకులను మరింత ఆకట్టుకునేలా తీర్చిదిద్దేందుకు రూ.9 కోట్లు తాజాగా కేటాయించడంతో సందర్శకులకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంతోపాటు పరిసరాలను సుందరీకరించడం, పచ్చదనాన్ని పెంచడం, నాలాల అభివృద్ధి వంటి పనులకు అధికారులు టెండర్లు పిలవనున్నారు.

కింద పార్కింగ్‌.. పైన లీజర్‌ ప్లేస్‌

ప్రధాన వాణిజ్య కేంద్రంగా బాసిల్లుతున్న హనుమకొండ చౌరస్తాలో వాహనాల పార్కింగ్‌ పెద్ద సమస్యగా మారింది. ఎక్కడపడితే అక్కడ పార్కింగ్‌తో ట్రాఫిక్‌ జామ్‌ కావడంతో పాటు రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న సందర్భాలు ఉన్నాయి. పాత బల్దియా కార్యాలయ స్థలంలో రీడెవలప్‌మెంట్‌ ఆఫ్‌ సెంట్రల్‌ ప్లాజా పేరుతో ఒక ఫ్లోర్‌ వాహనాల పార్కింగ్‌కు, ఆపైనా అంతస్తులో అక్కడకు వచ్చేవారు సేద తీరేందుకు ‘లీజర్‌ ప్లేస్‌’గా అభివృద్ధి చేసేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు రూపొందించిన కుడా అధికారులు త్వరలోనే టెండర్లు పిలవనున్నారు.

● వేయిస్తంభాల ఆలయం వద్ద పార్కింగ్‌, లైటింగ్‌, పచ్చదనం పెంపునకు రూ.20 కోట్లు కేటాయించారు. ఆలయానికి వచ్చే భక్తులు, పర్యాటకులకు మెరుగైన వసతులు కల్పించడం, రద్దీ సమయంలో వాహనాల నిర్వహణ సులభతరం కానుంది.

మొత్తం రూ.382 కోట్లు కేటాయింపు

ప్రపంచ బ్యాంకునుంచి రుణంగా

తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం

ఈ నిధులతో హనుమకొండ

కోర్‌ ఏరియా, ఖిలా వరంగల్‌ అభివృద్ధి

2027 ఆగస్టుకి బస్‌ టెర్మినల్‌ పూర్తి.. ఆపై ఐదంతస్తుల వాణిజ్య సముదాయం

కాకతీయుల వైభవానికి కొత్త సొబగులు

మూడేళ్లలోపు పూర్తికి కసరత్తు

కాకతీయుల కాలంలో వరంగల్‌ కోట రక్షణ వ్యవస్థలో కీలకంగా నిలిచిన మోటును పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దేందుకు ‘కుడా’ప్రణాళికలు రూ పొందించింది. ఖిలా వరంగల్‌ కోటలో ఇన్నర్‌, మిడిల్‌ మోటు అభివృద్ధి ప్రాజెక్టులకు కలిపి రాష్ట్ర ప్రభుత్వం రూ.209 కోట్లు కేటాయించింది. ఈ ప్రాజెక్టు అమలులో భాగంగా ఇప్పటికే ప్రయోగాత్మకంగా నార్త్‌ గేట్‌ నుంచి 300 మీటర్ల మేర రూ.2 కోట్లతో టెండర్‌ పనులు జరుగుతున్నాయి. దాదాపు ఇవీ సాధ్యమైనంత తొందర్లోనే పూర్తవుతాయని అధికారులంటున్నారు. తాజా ప్రతిపాదనలతో ఖిలా వరంగల్‌ కోట రాతి ప్రాకారం వెంట సుమారు నాలుగు కిలోమీటర్ల మేర ఇన్నర్‌ మోటు అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. ఇందులో బోటింగ్‌ సదుపాయం, సైక్లింగ్‌, వాకింగ్‌ ట్రాక్‌లు, వంతెనలు, గ్రీనరీ, లైటింగ్‌ వంటి వసతులు కల్పించనున్నారు. ప్రాజెక్టుకు అవసరమైన భూమిలో భాగంగా సుమారు 40 నుంచి 50 ఎకరాల ప్రైవేట్‌ భూమిని సేకరించాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఖిలా వరంగల్‌ మధ్యకోట ప్రాంతాన్ని కలుపుతూ సుమారు ఎని మిది కిలోమీటర్ల పరిధిలో మిడిల్‌ మోటు ప్రాజెక్టును కొత్తగా డిజైన్‌ చేశారు. ఇందులో భాగంగా ఖుష్‌మహల్‌, ఏకశిలాగుట్ట, గుండు చెరువు, కీర్తి తోరణాలు, శృంగారపు బావి వంటి చారిత్రక, పర్యాటక ప్రదేశాలను పునరుద్ధరించనున్నారు.

నయీంనగర్‌: వరంగల్‌ నగరాన్ని అభివృద్ధి చేస్తానని సీఎం రేవంత్‌ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు నగర అభివృద్ధికి రూ.382 కోట్ల అంచనా వ్యయంతో ఐదు కీలక ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేయడంపై ‘కుడా’ చైర్‌పర్సన్‌ గుండు సుధారాణి హర్షం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా హైదరాబాద్‌లో శుక్రవారం సీఎం రేవంత్‌ను కలిసి వరంగల్‌ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఐదు ప్రాజెక్టులతో నగర పర్యాటక రంగం అభివృద్ధితోపాటు వాణిజ్య కార్యకలాపాలు, స్థానిక ఉపాధి అవకాశాలకు మరింత ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఖిలా వరంగల్‌ కోటలో ఇన్నర్‌, మిడిల్‌

మోటు ప్రాజెక్టు : రూ.209 కోట్లు

వరంగల్‌ ఇంటిగ్రేటెడ్‌ బస్‌ టెర్మినల్‌, కమర్షియల్‌ కాంప్లెక్స్‌ : రూ.125 కోట్లు

మ్యూజికల్‌ గార్డెన్‌ : రూ.9 కోట్లు

సెంట్రల్‌ ప్లాజా : రూ.19 కోట్లు

వేయిస్తంభాల ఆలయ పరిసరాల్లో

పార్కింగ్‌, లైటింగ్‌,

గ్రీనరీ : రూ.20 కోట్లు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement