హన్మకొండ: ప్రయాణికుల రద్దీ మేరకు బస్సులు సమకూరుస్తామని ఆర్టీసీ కరీంనగర్ జోన్ ఈడీ సోలమన్ తెలిపారు. శుక్రవారం వరంగల్ రీజియన్ పర్యటనకు వచ్చిన ఆయన హనుమకొండ జిల్లా బస్ స్టేషన్‌ను పరిశీలించారు. ప్రయాణికులకు అందుతున్న సేవలను తె లుసుకున్నారు. సద్దుల బతుకమ్మ, దసరా పండుగకు వచ్చిన ప్రజలు తిరుగు ప్రయాణం, బస్సులు సమకూర్చడాన్ని పర్యవేక్షించారు. ఈనెల 25న (ఆదివారం), 26 (సోమవారం) న ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశముందని తెలిపారు. ఈ మేరకు అవసరమైన బస్సులు సమకూర్చాలని స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆయనవెంట వరంగల్ ఆర్‌ఎం ఎస్.భవానీప్రసాద్, డిప్యూటీ ఆర్‌ఎం శ్రీహర్ష, డిపో మేనేజర్లు పుప్పాల అర్పిత, రవిచంద్ర ఉన్నారు.
కాశిబుగ్గ: దేశాయిపేటలోని సీకేఎం ఆర్ట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న ఓ అధ్యాపకుడిపై వచ్చిన ఆరోపణలపై తాజాగా శుక్రవారం విచారణ జరిగినట్లు తెలుస్తోంది. గత నెలలో సదరు అధ్యాపకుడు విద్యార్థినిలపై వ్యవహరించిన తీరుపై కలెక్టర్‌కు ఫిర్యాదు రావడంతో ప్రాథమికంగా విచారణ జరిపిన విషయం తెలిసిందే. ఈ విచారణ రిపోర్టు ఽఆధారంగా ఆ ఽఅధ్యాపకుడిని సీకేఎం కళాశాల నుంచి భద్రాచలం డిగ్రీ కళాశాలకు బదిలీ చేశారు. ఇదే క్రమంలో రెండోసారి విచారణలో భాగంగా శుక్రవారం కమిషనర్ ఆఫ్ కాలేజ్ ఎట్ ఎడ్యుకేషన్ నుంచి విచారణ కమిటీ బృందం సభ్యులు వచ్చినట్లు సమాచారం. వీరు గత నెలలో జరిగిన ఘటనపై ప్రిన్సిపాల్‌తో పాటు సిబ్బందిని, విద్యార్థినులను, ఆరోపణలు ఎదుర్కొంటున్న అధ్యాపకుడిని విచారించినట్లు తెలుస్తోంది. కాగా, ఈ విచారణ కమిటీ బృందం సభ్యులు రిపోర్టును ఉన్నతాధికారులకు అందజేయనున్నారు.
కేయూ క్యాంపస్: కేయూ ఇంజనీరింగ్ విభాగాల డీన్‌గా ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసర్ కె.కిశోర్ నియమితులయ్యారు. ఇటీవల కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం ఉత్తర్వులు జారీ చేయగా.. కిశోర్ బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు డీన్‌గా విధులు నిర్వర్తించిన ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య రమణ నుంచి ఆయన బాధ్యతలు స్వీకరించారు. రెండేళ్లపాటు బాధ్యతలు నిర్వర్తించనున్నారు.
కేయూ క్యాంపస్: వెహికిల్ అలవెన్స్‌కు అనుమతిస్తూ ఈ ఏడాది ఆగస్టు 21న కేయూ రిజిస్ట్రార్ ఉత్తర్వులు జారీ చేశారు. కానీ, కేయూ బాయ్స్ హాస్టళ్ల డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ శ్రీనివాస్ ఫిబ్రవరి 17 నుంచి (జాయిన్ అయినప్పటి నుంచి) బిల్లు పెట్టుకున్నారు. ఆడిట్‌లో పాస్ చేయడంతో ఆయన నెలకు రూ.6 వేల చొప్పున 7 నెలలకు మొత్తం రూ.42 వేలు పొందారు. వర్సిటీలోని ఆడిట్ ఆఫీస్‌లో అధికారులు రిజిస్ట్రార్ జారీ చేసిన ఉత్తర్వులు ఆగస్టు 21 నుంచి అని ఉన్నప్పటికీ దాన్ని సరిగ్గా పరిశీలించకుండానే ఆడిట్ అధికారులు బిల్లును పాస్ చేశారు. అనంతరం మహిళా హాస్టళ్ల డైరెక్టర్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ సుమలత వెహికల్ అలెవెన్స్ బిల్లును ఆడిట్ ఆఫీస్‌లో అందించారు. రిజిస్ట్రార్ ఆర్డర్‌ను పరిశీలించిన ఆడిట్ ఆఫీస్ సిబ్బంది ఆగస్టు 21 నుంచే వెహికల్ అలెవెన్స్‌గా బిల్లు పెట్టుకోవాలని సూచించి సుమలత బిల్లును పాస్ చేయకుండా నిలిపేశారు. కాగా, ఇప్పటికే బిల్లు పొందిన బాయ్స్ హాస్టళ్ల డైరెక్టర్ శ్రీనివాస్‌తో మాట్లాడి ఆగస్టు 21 నుంచే అలవెన్స్ తీసుకోవాలని, అదనంగా పొందిన డబ్బులు వెనక్కి ఇవ్వాలని కోరినట్లు సమాచారం. ఈవిషయంపై ‘సాక్షి’ కేయూ రిజిస్ట్రార్ రామచంద్రంను వివరణ కోరగా.. తాను ఉత్తర్వులు జారీ చేసినప్పటి నుంచే అలవెన్స్ వర్తిస్తుందని, డైరెక్టర్ శ్రీనివాస్ డబ్బులు వెనక్కి చెల్లించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఖిలా వరంగల్: వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ యార్డుకు శుక్రవారం పత్తి పోటెత్తింది. ఒకేరోజు 1,846 బస్తాలు రాగా, గరిష్టంగా క్వింటాలుకు రూ.9,010 ధర పలికింది. ఈ స్థాయిలో పత్తి రావడం సీజన్‌లో ఇదే మొదటిసారని మార్కెట్ చైర్‌పర్సన్ ఎర్ర ప్రియాంక, కార్యదర్శి శ్రీనివాస్ తెలిపారు.


