ఎంజీఎం టు సూపర్‌ స్పెషాలిటీ! | - | Sakshi
Sakshi News home page

ఎంజీఎం టు సూపర్‌ స్పెషాలిటీ!

Oct 24 2026 10:20 AM | Updated on Oct 24 2026 10:20 AM

ఎంజీఎం టు సూపర్‌ స్పెషాలిటీ!

కాశిబుగ్గ: వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి ఉద్యోగులకు కష్టకాలం వచ్చింది. ఎప్పుడు ఎక్కడ విధులు నిర్వర్తించాలో, ఉన్నతాధికారుల నుంచి ఎప్పుడు ఫోన్‌కాల్‌ వస్తుందో తెలియని పరిస్థితి ఉందని వారు ఆందోళన చెందుతున్నారు. అటు ఎంజీఎం, ఇటు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో పనిచేస్తూ ఇబ్బందులు పడుతున్నామని పేర్కొంటున్నారు. ఉత్తర తెలంగాణకు పెద్దాస్పత్రిగా ఉన్న ఎంజీఎం స్థానంలో ప్రభుత్వం సూపర్‌ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మించిన విషయం విదితమే. ఈ ఆస్పత్రిలో దసరా రోజు ఓపీ సేవలను (సాఫ్ట్‌ లాంచింగ్‌) ప్రారంభిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ప్రకటించినా చివరకు వాయిదా పడింది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద, స్థానిక, సీఎంఓ, గ్రూప్‌వన్‌, నోడల్‌ అధికారులు ప్రత్యేక బాధ్యత తీసుకుని పనుల్లో వేగం పెంచారు. ఓపీ సేవలకు ఏర్పాట్లు చేశారు.

ఎంజీఎం సిబ్బంది సర్దుబాటు..

ఓపీ సేవలను ప్రారంభించేందుకు తేదీ నిర్ణయం కాకముందే ఎంజీఎంలోని సిబ్బందిని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో సర్దుబాబు చేశారు. వైద్యులు, పారా మెడికల్‌, ల్యాబ్‌, ఫార్మసీ, మినిస్టీరియల్‌, శానిటేషన్‌, సెక్యూరిటీ, పేషంట్‌ కేర్‌ సిబ్బందికి విధులు కేటాయించారు. సద్దుల బతుకమ్మ, దసరా పండుగను సైతం లెక్కచేయకుండా సిబ్బంది విధులు నిర్వర్తించినా ఓపీ సేవలు ప్రారంభం కాకపోవడం గమనార్హం.

పనులు ఎప్పుడు పూర్తవుతాయో?

ఓపీ సేవలు వాయిదా పడిన తర్వాత సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో అసంపూర్తి పనులు ఎప్పడు అవుతాయో అధికారులు చెప్పలేకపోతున్నారు. 24 అంతస్తుల్లో పనులు పూర్తి చేసేవరకు ఎంత సమయం పడుతుందో అంచనా వేయలేకపోతున్నారు. ఇదిలా ఉండగా.. ఎంజీఎంలో పనిచేస్తున్న వారిని ఎంజీఎంతోపాటు సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో పనిచేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చాలా మంది ఉద్యోగులు, సిబ్బంది సూపర్‌తో పాటు ఎంజీఎంలో పనిచేయాల్సి వస్తున్నట్లు సమాచారం. నిర్వహణ కోసం మంజూరవుతున్న నిధులు రెండు చోట్ల ఉపయోగిస్తున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. కాగా, ఓపీ సేవలు మాత్రం ఎంజీఎంలోనే ఉండడంతో రోగులకు ఊరట లభించింది.

అధికారుల ఎక్కడుంటారో తెలియదు..

వివిధ రకాల పనులు, చికిత్సకు వస్తున్న వారికి ఎంజీఎంలో అధికారులు అందుబాటులో ఉండకపోవడం సమస్యగా మారుతోంది. ఏ అధికారి ఎక్కడ ఉంటాడో తెలియని పరిస్థితి ఉంది. వారి విధులను తెలుసుకోవడం కష్టమవుతోంది. ఎవరైనా పనుల కోసం వస్తే సార్లు లేరు.. సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఉన్నారు.. ఎప్పుడొస్తారో తెలియదంటూ సిబ్బంది సమాధానం చెబుతున్నారు. ఇదీ కొత్త ఆస్పత్రి, పాత ఆస్పత్రి పరిస్థితి.

రెండు చోట్ల విధులు

నిర్వర్తిస్తున్న ఉద్యోగులు

ఓపీ సేవల ప్రారంభం వాయిదా.. సిబ్బందికి తప్పని ఇబ్బందులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement