అక్కే నాకు రోల్‌మాడల్‌ | - | Sakshi
Sakshi News home page

అక్కే నాకు రోల్‌మాడల్‌

Oct 25 2026 1:29 AM | Updated on Oct 25 2026 1:29 AM

అక్కే నాకు రోల్‌మాడల్‌

న్యాయవాద వృత్తి నేపథ్యం లేని కుటుంబమైన్నప్పటికీ తన గమ్యమేంటో తనకు తెలుసు. మరెంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలవాలన్న ఆశే ఆమెను విజయం వైపు నడిపించింది. ఇటీవల జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికై న వరంగల్‌కు చెందిన ఫర్హానా తబస్సుమ్‌ విజయ ప్రస్థానం ఆమె మాటల్లోనే..

సాధారణ కుటుంబం. తండ్రి మహమ్మద్‌ రజాక్‌ రైల్వేలో లోకో పైలట్‌గా పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందారు. అమ్మ ముంతాజ్‌ బేగం గృహిణి. నా పాఠశాల విద్య వరంగల్‌ పబ్లిక్‌ స్కూల్లో ముగిసింది. ఆ తర్వాత చైతన్య డిగ్రీ కళాశాలలో బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ (బీబీఎం) పూర్తి చేసి, కేయూలో ఎంబీఏ పట్టా పొందా. న్యాయ వృత్తిపై ఉన్న మక్కువతో ఆదర్శ లా కళాశాలలో ఎల్‌ఎల్‌బీ పూర్తి చేశా. అదే ఏడాది తెలంగాణ బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నా.

ఆ ఒక్కటే నాకు స్ఫూర్తి..

సమాజంలో చట్టం ముందు అందరూ సమానులే అనే భావన నాకు ఎప్పుడూ స్ఫూర్తినిచ్చేది. మా అక్క ఫహీమా సుల్తానా అసిస్టెంట్‌ మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్‌గా తన వృత్తిపై చూపిన అంకితభావం నాకు రోల్‌ మోడల్‌.

వైఫల్యాల నుంచి విజయానికి...

2022లో తొలి ప్రయత్నంలో ప్రిలిమ్స్‌ ఉత్తీర్ణత సాధించాను. మెయిన్స్‌లో విజయం సాధించలేకపోయా. 2024లోనూ మెయిన్స్‌లో వెనుకంజ వేయాల్సి వచ్చింది. ఈ పరాజయాలు నన్ను కుంగదీయలేదు. మరింత పకడ్బందీ ప్రణాళికతో ముందుకు సాగాను. మెయిన్స్‌ పరీక్షలో నెగ్గాలంటే కేవలం చట్టాలను వల్లె వేయడం సరిపోదని, నిర్ణీత సమయంలో సమర్థవంతంగా సమాధానాలు రాయడం చాలా ముఖ్యమని గ్రహించాను. అందుకే, గత ప్రశ్నపత్రాలను సేకరించి, ఇంట్లోనే ప్రతీరోజూ రెండు నుంచి మూడు గంటల పాటు మాక్‌ టెస్టులు రాశా.

నా విజయ రహస్యం

2025 నియామక ప్రక్రియలో మెయిన్స్‌ పరీక్షలో ప్రతిభ కనబర్చి ఉత్తీర్ణత సాధించా. ఆతర్వాత జరిగిన ఇంటర్వ్యూలోనూ రాణించి, చివరకు 2026లో జూనియర్‌ సివిల్‌ జడ్జిగా ఎంపికయ్యా. న్యాయసేవల పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు వైఫల్యాలు ఎదురైతే నిరుత్సాహపడొద్దు. మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించాలనే నియమం ఏమీ లేదు. బలహీనతలను నిజాయితీగా విశ్లేషించుకోవాలి. చట్టాలను చదవడం మాత్రమే కాకుండా, వాటిని నిరంతరం పునఃశ్చరణ చేయాలి. నిరంతరం సాధన చేయాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement