మూడో డిస్కం ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో చిగురించిన ఆశలు
హన్మకొండ : రాష్ట్రంలో మూడో డిస్కం తెలంగాణ రైతు డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (టీజీ ఆర్‌పీడీసీఎల్) ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ డిస్కంకు వెళ్లేందుకు ముందుకొచ్చి న విద్యుత్ ఉద్యోగుల్లో ఆశలు చిగురించాయి. టీజీ ఆర్‌పీడీసీఎల్ ఏర్పాటు చేస్తూ ఇంధన శాఖ సోమవారం జీఓ జారీ చేసింది. దీని ఏర్పాటుకు విస్తృత విధి విధానాలు నిర్దేశించింది. పంపిణీ నెట్ వర్క్ మానవ వనరులు, వినియోగదారులు, విద్యుత్ కొనుగోలు కేటాయింపులు, ఆస్తులు–అప్పుల బదిలీపై జీఓలో స్పష్టత ఇచ్చింది. టీజీ ఆర్‌పీడీసీఎల్‌కు మొత్తం 2,000 మంది అధికారులు, ఉద్యోగులు అవసరమని జీఓలో పేర్కొంది. రాష్ట్రంలోని టీజీ జెన్ కో, టీజీ ట్రాన్స్ కో, టీజీ ఎన్పీడీసీఎల్, టీజీ ఎస్పీడీసీఎల్‌కు చెందిన ఉద్యోగుల నుంచి ఆప్షన్ కోరారు. దీంతో ఒక్క టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి 1,252 మంది ఆప్షన్ ఇచ్చారు. ఇతర డిస్కంల్లోనూ ఇదే పోటీ నెలకొందని విద్యుత్ ఉద్యోగులు తెలిపారు. మూడో డిస్కంకు వెళ్తేనే పదోన్నతి వస్తుందని ఆశించి ప్రతీ ఒక్కరు ఆప్షన్ ఇచ్చారు. ఈ ఆప్షన్లు ఇచ్చిన వివరాలు, సంబంధిత సర్కిల్ వారీగా వారి వివరాలు పరిశీలించారు. ఆప్షన్‌లో పొందుపరిచిన వివరాలు... వాస్తవ వివరాలు సరి చూసి జాబితాను మూడో డిస్కంకు పంపారు. మే నెలలోనే బదిలీ నియామక ప్రక్రియ పూర్తి చేసేలా షెడ్యూల్ ప్రకటించిన టీజీ ఆర్‌పీడీసీఎల్ తర్వాత వెనక్కి తగ్గింది. మే 13 నుంచి 19 వరకు బదిలీ ఉత్తర్వులు, జాయినింగ్, పోస్టింగ్ పూర్తి అయ్యేలా ఖరారు చేసినా చివరకు ప్రక్రియ నిలిచిపోయింది.
నాలుగు విద్యుత్ సంస్థల నుంచి తీసుకుంటామని చెప్పినా అయితే ప్రస్తుత జీఓలో మానవ వనరుల సమీకరణ ఏ విధానంలో చేపడుతారో ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. కేవలం పదోన్నతి కల్పించనున్న ట్లు మాతమే జీఓలో పేర్కొన్నారు. గతంలో ఆప్షన్ ఇచ్చిన వారి నుంచి అధికారులు, ఉద్యోగులను తీసుకుంటారా..? కొత్తగా మరోసారి ఆప్షన్లు కోరుతారా అనే అంశం స్పష్టత రావాల్సి ఉంది. దీంతో పాటు నాలుగు సంస్థల్లో ఏ సంస్థ నుంచి ఎంత మందిని తీసుకుంటారనే అంశం కూడా తేల్చాల్సి ఉంది. డిస్కంల నుంచి విడిపోతున్న నేపథ్యంలో ఉ ద్యోగుల ఎంపికలో డిస్కంలకు ప్రాధాన్యత ఇస్తారా... టీజీ ట్రాన్స్ కో, టీజీ జెన్‌కోతో సమానంగా ఉద్యోగులను తీసుకుంటారా అనే వివరాలు ఇంధన శాఖ, టీజీ ఆర్‌పీడీసీఎల్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి మొత్తం 1,252 మంది ఆర్‌పీడీసీఎల్‌కు వెళ్లేందుకు ఆప్షన్ ఇచ్చారు. ఇందులో జూనియర్ లైన్‌మెన్లు 16 మంది, అసిస్టెంట్ లైన్ మెన్లు 271 మంది, లైన్‌మెన్లు 116, లైన్ ఇన్స్‌పెక్టర్లు 31, సీనియర్ లైన్ ఇన్‌స్పెక్టర్లు 4, ఫోర్‌మెన్లు 2, అసిస్టెంట్ ఇంజనీర్లు 115, అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్లు 61, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్లు 59, డివిజనల్ ఇంజనీర్లు 28, సూపరింటెండ్ ఇంజనీర్లు 4, ఒక చీఫ్ ఇంజనీర్, సబ్ ఇంజనీర్లు 265, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్లు 66, ఆసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్లు 10, అకౌంట్స్ ఆఫీసర్స్ 5, సీనియర్ అసిస్టెంట్లు 50, జూనియర్ అసిస్టెంట్లు 20, జూనియర్ పర్సనల్ ఆఫీసర్లు 15, పర్సనల్ ఆఫీసర్లు 2, ఆర్టిజన్ గ్రేడ్‌కు చెందిన వారు 5, ఆర్టిజన్ గ్రేడ్–3కి చెందిన వారు 6 గురు, ఒక్కరు ఆర్టిజన్ గ్రేడ్– 4, ఒక్క రికార్డు అసిస్టెంట్, ఒక్క సివిల్ ఈఈ దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. టీజీ ఆర్‌పీడీసీఎల్ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జీఓ ఇవ్వడంతో మరోసారి ఆప్షన్ ఇచ్చిన వారు ఆశల్లో తేలియాడుతున్నారు. పదోన్నతి లభిస్తుందనే సంతోషంలో ఉన్నారు. బదిలీ నియామక ప్రక్రియ ఎప్పటి నుంచి చేపడుతారోనని ఆశగా ఎదురుచూస్తున్నారు.
టీజీఆర్‌పీడీసీఎల్‌కు మొత్తం కావాల్సిన ఉద్యోగులు 2,000 మంది
ఒక్క టీజీ ఎన్పీడీసీఎల్ నుంచి 1,252 మంది దరఖాస్తు
టీజీ ఆర్‌పీఈసీఎల్ ఏర్పాటు చేస్తూ
జీఓ జారీ
ఉద్యోగుల ఎంపికపై లేని స్పష్టత


