కేర్‌ టేకర్‌గా వచ్చి ప్రాణం తీశాడు | - | Sakshi
Sakshi News home page

కేర్‌ టేకర్‌గా వచ్చి ప్రాణం తీశాడు

Oct 13 2026 1:17 AM | Updated on Oct 13 2026 1:17 AM

కాశిబుగ్గ : వరంగల్‌ మట్టెవాడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగిన వృద్ధుడి హత్య కేసులో నిందితుడిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. సీఐ ఎన్‌.కరుణాకర్‌ కథనం ప్రకారం.. వరంగల్‌లోని శాంతినగర్‌ బ్యాంకు కాలనీకి చెందిన డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ రిటైర్డ్‌ ఇంజనీర్‌ కొలిపాక వెంకటస్వామి (75) సెప్టెంబర్‌ 1న హత్యకు గురయ్యాడు. దీంతో వెంకటస్వామి కుమారుడు శ్రవణ్‌కుమార్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

హత్యకు దారితీసిన కేర్‌ టేకర్ల గొడవ

వృద్ధుడైన తండ్రిని చూసుకోవడానికి కుటుంబ సభ్యులు భీమారంలోని రామ్‌ కేర్‌ టేకర్‌ సర్వీసెస్‌ ద్వారా నిట్ట రాంబాబు, శాంతను కేర్‌ టేకర్లుగా నియమించుకున్నారు. అయితే వీరి మధ్య గొడవ జరగడంతో ఇక వారు అవసరం లేదని కుటుంబ సభ్యులు తేల్చి చెప్పారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన రాంబాబు అతిగా మద్యం తాగి, వెంకటస్వామిని కిందకు తోసి కడియంతో తలపై, పక్కటెముకలపై తీవ్రంగా దాడి చేసి హత్య చేశాడు.

సాక్ష్యాధారాలు లేకుండా చేసి..

వృద్ధుడిపై దాడి అనంతరం సాక్ష్యాధారాలు లేకుండా చేసేందుకు పన్నాగం పన్నాడు. రక్తపు మరకలను తుడిచేసి, రక్తం అంటిన బనియన్‌ను పారేసి, నేరాన్ని కప్పి పుచ్చుకునేందుకు వృద్ధుడు కింద పడ్డాడంటూ సెక్యూరిటీ గార్డుకు, కుటుంబ సభ్యులకు అబద్ధం చెప్పాడు. చివరకు పోలీసులు క్షుణ్ణంగా దర్యాప్తు చేసి వాస్తవాలను రాబట్టారు. ఈ నెల 11న ఎంజీఎం ఆస్పత్రి వద్ద అతడిని పోలీసులు అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన కడియంను స్వాధీనం చేసుకుని, చట్టపరమైన చర్యల నిమిత్తం రిమాండ్‌కు పంపినట్లు సీఐ ఎన్‌.కరుణాకర్‌ తెలిపారు.

వృద్ధుడి హత్య కేసులో నిందితుడి అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement