వరంగల్ అర్బన్: బల్దియా ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో టౌన్‌ప్లానింగ్ విభాగానికి అధిక వినతులు వచ్చాయి. నగరవాసులు పలు భూ సంబంధ, అనుమతులు, ఇతరత్రా సమస్యలపై ఎక్కువగా విజ్ఞప్తులు చేశారు. నగరవాసులనుంచి కమిషనర్ దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 72 దరఖాస్తులు రాగా, టౌన్ ప్లానింగ్‌కు 30, ఇంజనీరింగ్ విభాగానికి 15, హెల్త్ అండ్ శానిటేషన్‌కు 5, రెవెన్యూకు 14, తాగునీటి సరఫరా 7, హార్టికల్చర్ 1 చొప్పున దరఖాస్తులు అందాయి. గ్రీవెన్స్ సెల్‌కు అందిన ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని, ప్రతీ ఫిర్యాదును బాధ్యతాయుతంగా పరిష్కరించాలని బల్దియా కమిషనర్ టి.వెంకన్న అధికారులను ఆదేశించారు.
అధికారులతో సమీక్ష..
పన్నుల వసూళ్లు, పారిశుద్ధ్య నిర్వహణ, తదితర అంశాలపై అధికారులతో కమిషనర్ వెంకన్న సమీక్ష నిర్వహించారు. నగరంలోని అమ్మవారిపేటలో ఇటీవల 150 కేఎల్‌డీ సామర్థ్యంతో సెప్టిక్ ట్యాంక్ మల వ్యర్థాల శుద్ధి ప్లాంట్ అందుబాటులోకి వచ్చిందని తెలిపారు. ప్రతీ మూడేళ్లకు ఒకసారి సెప్టిక్ ట్యాంకుల శుభ్రత నగర పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా సెప్టిక్ ట్యాంకుల శుభ్రతపై అధికారులు, ప్రజల్లో అవగాహన కల్పించాలని కమిషనర్ సూచించారు. సమీక్షలో అడిషనల్ కమిషనర్ జోనా, సూపరింటెండింగ్ ఇంజనీర్ రాజ్‌కుమార్, సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్నరాణి, సమ్మయ్య, సెక్రటరీ అనిల్‌బాబు, పన్నుల అధికారి రామకృష్ణ అన్ని విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
హనుమకొండలో..
హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలను పెండింగ్‌లో ఉంచకుండా గడువులోగా పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్, అదనపు కలెక్టర్ ఎన్.రవి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈసందర్భంగా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ.. ప్రజావాణి పోర్టల్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు. ప్రజావాణికి అధికారులు సమయానికి హాజరు కావాలని, కారుణ్య నియామకాల భర్తీకి శాఖల వారీగా వివరాలు అందించాలని ఆదేశించారు. మంగళవారం నిర్వహించే వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని సూచించారు. కలెక్టరేట్‌తో పాటు హనుమకొండ, పరకాల ఆర్డీఓ కార్యాలయాలు, మండల పరిషత్ అభివృద్ధి కార్యాలయాల్లోనూ ప్రజావాణి నిర్వహించారు. జిల్లా అటవీ శాఖ అధికారి ముకుందరెడ్డి వన మహోత్సవం ఏర్పాట్లపై అధికారులకు వివరించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ శేషాద్రి, డీఆర్‌ఓ శ్రీనివాస్, డీఆర్డీఓ మేన శ్రీను, సీపీఓ సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
వరంగల్‌లో..
న్యూశాయంపేట: ప్రజావాణికి వచ్చే ఫిర్యాదులకు ప్రాధాన్యం ఇచ్చి ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్యశారద ఆదేశించారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా ప్రజల నుంచి ఆమె వినతులు స్వీకరించారు. గ్రీవెన్స్‌కు 145 దరఖాస్తులు రాగా, వాటిలో రెవెన్యూశాఖకు సంబంధించినవి 42, జీడబ్ల్యూఎంసీ 26, హౌసింగ్ 14, డీఆర్డీఓ 14, ఇతర శాఖలకు సంబంధించి 49 దరఖాస్తులు వచ్చాయని కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజల సౌకర్యార్థం కలెక్టరేట్‌లో ప్రతీ సోమవారం అరగంట ముందు (ఉదయం 10గంటలు) ప్రజావాణి కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. జిల్లాతోపాటు మండలాల పరిధిలో కూడా గ్రీవెన్స్ నిర్వహిస్తుండడంతో కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌కు వచ్చే ఫిర్యాదుదారుల సంఖ్య తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు సంధ్యారాణి, వైవీ.గణేశ్, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, డీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
బల్దియా గ్రీవెన్స్‌లో ఈ విభాగానికి
30 వినతులు
అందిన దరఖాస్తులు మొత్తం 72
అర్జీల పరిష్కారంలో అలసత్వం వద్దు : బల్దియా కమిషనర్ టి.వెంకన్న


