● కిలో రూ.40 నుంచి ఏకంగా
రూ.75కు పెరిగిన ధర
● ఆందోళనలో వినియోగదారులు
సాక్షి, వరంగల్: తీపిని పంచే చక్కెర ధర ఇప్పుడు చేదు పుట్టిస్తోంది. కొద్ది రోజుల క్రితం కిలో రూ.40కి లభించిన పంచదార.. ప్రస్తుతం కొన్ని స్థానిక కిరాణా దుకాణాల్లో ఏకంగా రూ.75 వరకు ధర పలుకుతోంది. ఒక్కసారిగా అమాంతం పెరిగిన ధరతో సామాన్య వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. టీ, కాఫీ నుంచి స్వీట్లు, పిండి వంటల్లో నిత్యావసరంగా మారిన చక్కెర ధర పెరగడంతో నెలవారీ ఇంటి బడ్జెట్‌పై అదనపు భారం పడుతోంది. వరంగల్ జిల్లాలో నెలకు దాదాపు 1,500 టన్నుల విక్రయాలు జరుగుతుండడంతో ఇప్పటివరకు రూ.6 కోట్లు హోల్‌సేల్ వ్యాపారం జరిగితే ఇప్పుడు పెరిగిన ధరలతో ఏకంగా రూ.11.25 కోట్లు అవుతోంది. సంవత్సరానికి ఏకంగా రూ.135 కోట్లవుతోందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో రిటైల్ ధర రూ.60 దాటగా.. మహారాష్ట్రలోని కొన్ని మార్కెట్లలో రూ.75 నుంచి 80 వరకు చేరాయి. వరంగల్ నగరంలో డెలివరీకి అందుబాటులో ఉన్న కొన్ని ఆన్‌లైన్ లిస్టింగ్‌లో కిలో చక్కెర రూ.60 నుంచి 72 మధ్య ఉంటోంది. స్థానిక దుకాణాల్లో రూ.70 నుంచి 75కు విక్రయిస్తుండగా.. ఆన్‌లైన్‌లో ఆఫర్లు, డిస్కౌంట్లతో రూ.60 నుంచి రూ.66లోనే లభిస్తుండడంపై వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు.
ఇంటి బడ్జెట్‌పై ప్రభావం..
చక్కెర వినియోగం ప్రతీ ఇంట్లో తప్పనిసరి కావడంతో ధర పెరుగుదల నేరుగా కుటుంబ ఖర్చులపై పడుతోంది. ముఖ్యంగా టీ, కాఫీ ఎక్కువగా తీసుకునే కుటుంబాలతో పాటు స్వీట్లు, బేకరీ పదార్థాల తయారీదారులపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది. పండుగల సీజన్ సమీపిస్తున్న నేపథ్యంలో ధరలు మరింత పెరిగితే స్వీట్లు, ఇతర ఆహార పదార్థాల ధరలపైనా పరోక్ష ప్రభావం పడే అవకాశం ఉంది. ప్రభుత్వాలు జోక్యం చేసుకొని ధరలు తగ్గించాలి
– రమ, గృహిణి, వరంగల్


