నామి‘లేట్‌’ పదవులు! | - | Sakshi
Sakshi News home page

నామి‘లేట్‌’ పదవులు!

Aug 25 2026 1:45 AM | Updated on Aug 25 2026 1:45 AM

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

నామినేటెడ్‌ పదవులపై మరోసారి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రాజకీయ వేడి మొదలైంది. 2024లో రాష్ట్ర ప్రభుత్వం నియమించిన పలువురు రాష్ట్రస్థాయి కార్పొరేషన్‌ చైర్మన్ల పదవీకాలం జూలై 8న ముగిసింది. వారి స్థానంలో కొత్తవారిని నియమించడమా? లేక పాతవారినే మరోసారి కొనసాగిస్తారా? అనే దానిపై వెంటనే నిర్ణయం వస్తుందని భావించారు. ఆపదవుల కాలం ముగిసి 47 రోజులు గడిచినా ఆ ప్రస్తావనే లేదు. దీంతో ఇటు తాజా మాజీలు.. అటు ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా, ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలో నామినేటెడ్‌ పదవుల భర్తీకి మరికొంత సమయం పట్టే అవకాశం ఉందన్న ప్రచారం కాంగ్రెస్‌ వర్గాల్లో సాగుతోంది. ఇప్పటికే పదవులు ముగిసిన వారిలో కొందరు మరోసారి కొనసాగేందుకు అధిష్టానం పెద్దలను కలుస్తుండగా.. గత ఎన్నికల్లో టికెట్లు ఆశించి అవకాశం దక్కని వారు, ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలైన నాయకులు, దీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేస్తున్న సీనియర్లు పదవుల కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

ఆశావహుల్లో ఉత్కంఠ..

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజులకే దశల వారీగా నామినేటెడ్‌ పదవులను భర్తీ చేసింది. 2024 జూలై 8న ఒకేరోజు రాష్ట్రవ్యాప్తంగా 37 మంది చైర్మన్లను ప్రభుత్వం నియమించగా.. ఉమ్మడి వరంగల్‌ నుంచి ఆరుగురికి అవకాశం లభించింది. పాలకుర్తి, వరంగల్‌ పశ్చిమ టికెట్లను ఆశించి తప్పుకున్న జంగా రాఘవరెడ్డికి ఆయిల్‌ సీడ్స్‌ గ్రోవర్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవి, పరకాల నుంచి పోటీకి వైదొలిగిన ఇనగాల వెంకట్రాంరెడ్డికి ‘కుడా’ చైర్మన్‌ పదవి లభించాయి. మహబూబాబాద్‌ నుంచి బెల్లయ్య నాయక్‌కు ట్రైబల్‌ కో–ఆపరేటివ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, భూపాలపల్లి నుంచి అయిత ప్రకాశ్‌రెడ్డికి ట్రేడ్‌ ప్రమోషన్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ పదవులు దక్కాయి. మాజీ ఎమ్మెల్యే పోదెం వీరయ్యకు ఫారెస్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌, ఎండీ రియాజ్‌కు గ్రంథాలయ పరిషత్‌ వంటి కార్పొరేషన్‌ చైర్మన్‌ పోస్టులు అప్పగించారు. జూలై 8న వారి పదవీకాలం పూర్తయ్యింది. కాగా, జిల్లాలో మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యకు తొలుత నామినేటెడ్‌ పోస్టు (రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ చైర్మన్‌) పదవి కట్టబెట్టిన అధిష్టానం.. ఆయన పదవీకాలం ముగిసిన వెంటనే మరో రెండేళ్లు పొడిగించింది. మిగతా ఆరు పోస్టులపై మాత్రం కొనసాగుతున్న సస్పెన్స్‌ తాజా మాజీలు, ఆశావహుల్లో ఉత్కంఠ రేపుతోంది.

సీఎం, పీసీసీ చీఫ్‌, మంత్రులదే తుది నిర్ణయం

ఈసారి నామినేటెడ్‌ పదవుల భర్తీలో అధిష్టానం ఎలాంటి ఫార్ములాను అనుసరిస్తుందన్నది కాంగ్రెస్‌ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ కోసం నిరంతరం పనిచేసిన వారికి ప్రాధాన్యం ఇస్తారా? ఇప్పటికే పదవులు అనుభవించిన వారికి మరో అవకాశం కల్పిస్తారా? సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యతకు పెద్దపీట వేస్తారా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆరు జిల్లాల మధ్య సమతుల్యతతో పాటు ఆయా సామాజికవర్గాలకు ప్రాతినిథ్యం కల్పించడం కీలకంగా మారనుంది. ఒకరికి పదవి ఇస్తే మరో సామాజికవర్గం నుంచి వచ్చే డిమాండ్‌ను ఎలా సమన్వయం చేయాలన్నది అధిష్టానానికి సవాలుగా మారే అవకాశముంది. ఇదిలా ఉండగా.. నామినేటెడ్‌ పోస్టుల భర్తీకి మరి కొంత సమయం పట్టవచ్చని పార్టీకి చెందిన ఓ సీనియర్‌ నేత ‘సాక్షి ప్రతినిధి’కి తెలిపారు. స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌), ఇటీవలి రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరింత ఆలస్యం కావొ చ్చన్న అభిప్రాయం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. కాగా, ఈసారి కూడా నామినేటెడ్‌ పోస్టుల భర్తీలో సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ చీఫ్‌ బొమ్మ మహేశ్‌కుమార్‌తో పాటు ఆయా జిల్లాల ఇన్‌చార్జ్‌ మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల సిఫార్సులే కీలకంగా మారనున్నాయన్న చర్చ కూడా పార్టీ వర్గాల్లో నడుస్తోంది.

మా పేర్లు పరిశీలించండి..

ఓవైపు తాజా మాజీలు కొనసాగింపు కోసం ప్రయత్నాలు చేస్తుండగా.. మరోవైపు కొత్తగా పదవులు ఆశిస్తున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఉమ్మడి జిల్లాకు చెందిన పలువురు సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు కార్పొరేషన్‌ చైర్మన్‌, డైరెక్టర్‌, ఎమ్మెల్సీ తదితర నామినేటెడ్‌ పదవుల కోసం పోటీలో ఉన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ, జిల్లా స్థాయిల్లో పార్టీకి సేవలందించిన దొమ్మాటి సాంబయ్య, శనిగరపు ఇందిర, హనుమాండ్ల ఝాన్సీరెడ్డి, కె.రవళి, నమిండ్ల శ్రీనివాస్‌, ఈవీ శ్రీనివాసరావు, పింగిళి వెంకట రాంనర్సింహరెడ్డి, డాక్టర్‌ పెరుమాండ్ల రామకృష్ణ, బొమ్మనపల్లి అశోక్‌రెడ్డి, గాజర్ల అశోక్‌తో పాటు పలువురు నేతలు పదవుల రేసులో ఉన్నారు. వెన్నం శ్రీకాంత్‌రెడ్డి, భరత్‌ చంద్రారెడ్డి, గొల్లపల్లి రాజేందర్‌, మార్క విజయ్‌కుమార్‌, అబూబక్కర్‌, పోలెపల్లి రంజిత్‌రావు, మరికొందరు సీనియర్లు కూడా తమ పేర్లను పరిశీలించాలని అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నట్లు కూడా పార్టీ వర్గాల సమాచారం.

47 రోజులు గడిచినా నామినేటెడ్‌ పోస్టులపై నాన్చివేత ధోరణి

మరింత సమయం పట్టే అవకాశం

రెన్యూవల్‌ చేస్తారా..

కొత్తవారికి ఇస్తారా? అని సందిగ్ధం

ఎటూ తేల్చని అధిష్టానం..

తాజా మాజీల్లో టెన్షన్‌

రోజురోజుకూ పెరుగుతున్న

ఆశావహులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement