హన్మకొండ అర్బన్: ఉమ్మడి వరంగల్ జిల్లాలో 108 అంబులెనన్స్ సేవల్లో పనిచేస్తున్న ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు (ఈఎంటీలు), పైలట్లకు నిర్వహించిన రిఫ్రెషర్ శిక్షణ శనివారం ముగిసింది. హనుమకొండ కలెక్టరేట్‌లో జూలై 28 నుంచి నిర్వహించిన ఈ శిక్షణలో 200 మంది ఈఎంటీలు, 200 మంది పైలట్లు పాల్గొన్నారు. గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు, పక్షవాతం, శ్వాసకోశ సమస్యలు, విషపూరిత ఘటనలు, చిన్నారుల అత్యవసర చికిత్సతోపాటు ప్రీ–హాస్పిటల్ కేర్, ప్రాథమిక వైద్య సేవలపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ప్రతి 6 నెలలకు ఒకసారి నిర్వహించే ఈ శిక్షణ అత్యవసర పరిస్థితుల్లో మెరుగైన సేవలు అందించేందుకు దోహదపడుతుందని అధికారులు తెలిపారు. గత ఏడాది హనుమకొండ జిల్లాలో 108 సేవల ద్వారా 1,750 మంది, వరంగల్‌లో 2,150 మంది, ములుగులో 1,950 మంది, భూపాలపల్లిలో 1,000 మంది ప్రాణాలను కాపాడినట్లు పేర్కొన్నారు. ఉమ్మడి వరంగల్ 108 ప్రోగ్రాం మేనేజర్ పాటి శివకుమార్, ఇన్‌్‌స్ట్రక్టర్ పార్వతమ్మ, జిల్లా మేనేజర్లు పాల్గొన్నారు.


