86 ఏళ్లుగా ప్రభు సేవలో..
డోర్నకల్: డోర్నకల్‌లో ప్రసిద్ధిగాంచిన ఎఫిఫనీ చర్చి 86 ఏళ్లుగా ప్రభు సేవలో తరిస్తోంది. నాటి మద్రాస్ బిషప్ వైట్ హెడ్ ఆధ్వర్యంలో 1915 జనవరి 24న చర్చి నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఈ నిర్మాణం 1939లో పూ ర్తికాగా డోర్నకల్ బిషప్ అజరయ్య నేతృత్వంలో అదే సంవత్సరం ఎఫిఫనీ పండుగ రోజున ప్రారంభించి ఎఫిఫనీ చర్చిగా నామకరణం చేశారు. ద్రవిడ, క్రైస్తవ, హిందూ, ముస్లిం మతాల ఆచార వ్యవహారాలు, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ చర్చిని నిర్మించారు. చర్చి ముఖ శిఖ రాలు మసీదు గుమ్మటాలను పోలి ఉండగా వాటిపై రెండు పద్మాలు, రెండు శిలువలు ఉంటాయి. ఆలయం లోపల ఏసుక్రీస్తు 12 మంది శిష్యుల పేరుతో 12 స్తంభాలను నిర్మించారు. స్తంభాలకు ఇరువైపులా ఉమ్మెత్త పుష్పాలు, అరటి మొగ్గలు నిర్మించారు. దీంతో అద్భుత శిల్ప సౌందర్యంతో నిర్మించిన ఈ చర్చిని సందర్శించేందుకు ప్రతీ సంవత్సరం దేశ, విదేశాల నుంచి అనేకమంది డోర్నకల్‌కు వస్తున్నారు. కాగా, ఎఫిఫనీతోపాటు డోర్నకల్ పరిధిలోని పలు చర్చిల్లో బుధవారం అర్ధరాత్రి నుంచి క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి.


