వైభవంగా ధ్వజస్తంభాల పునఃప్రతిష్ఠ వేడుక
ఎస్‌ఎస్‌తాడ్వాయి : మేడారం అమ్మవార్ల గద్దెల ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలపై ధ్వజ స్తంభాల పునః ప్రతిష్ఠాపన వేడుక వైభవంగా జరిగింది. బుధవారం ఉదయం 7 నుంచి మొదలైన పూజ కార్యక్రమాలు మధ్యాహ్నం 2 గంటల వరకు సాగాయి. పగిడిద్దరాజు, గోవిందరాజు పూజారులు సమ్మక్క, సారలమ్మ పూజారులతో కలిసి గద్దెలపై ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించారు. పూజల అనంతరం అమ్మవార్లకు పూజారులు యాటలను నైవేద్యంగా సమర్పించారు.
మార్మోగిన గద్దెల ప్రాంగణం..
ధ్వజ స్తంభాలను నూతన గద్దెలపైకి తీసుకొసున్న క్రమంలో ఆదివాసీల డోలు వాయిద్యాల చప్పులతో గద్దెల ప్రాంగణం మార్మోగింది. శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు పూజారులతోపాటు వారి కుటుంబీలు వందల సంఖ్యలో హాజరయ్యారు. భక్తుల దర్శనాలు నిలిపేయడంతో ప్రశాంత వాతావరణంలో పునః ప్రతిష్ఠాపన కార్యక్రమం నిర్వహించారు.
నూతన గద్దెలను దర్శించుకున్న
మంత్రి సీతక్క
గోవిందరాజు, పగిడిద్దరాజు నూతన గద్దెలను మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్ టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, మేడారం ఈఓ వీరస్వామి, మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, మేడారం సర్పంచ్ భారతి, పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు, పూజారులు దర్శించుకున్నారు. పూనుగొండ్ల, కొండాయి నుంచి వచ్చిన పూజారుల కుటుంబీలు, బంధువులు గద్దెలను దర్శించుకుని పూజలు చేశారు.
పూర్వీకుల సిద్ధాంతాన్ని ఆచరిస్తున్నాం..
ఆదివాసీ సంప్రదాయ పద్ధతిలో పగిడిద్దరాజు, గోవిందరాజుల ఽగద్దెలపై ధ్వజ స్తంభాల పునః ప్రతిష్ఠాపన కార్యక్రమం వైభవంగా జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. బుధవారం గద్దెల పునఃప్రతిష్ఠాపన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను వరుస క్రమంలో పూజారుల అనుమతితోనే ప్రతిష్ఠాపన చేస్తున్నామని, పూర్వీకుల ఆదేశాలతో పాటు ప్రకృతి సిద్ధాంతాన్ని ఆచరిస్తున్నామని తెలిపారు. నేడు మొదటి ఘట్టం ప్రారంభమైందని, అన్ని కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తామని తెలిపారు. పూర్వకాలంలో గిరిజనులకు పసుపుతో ఎంతో అనుబంధం ఉందన్నారు. శాసీ్త్రయంగా పసుపుతో పలు వ్యాధులను నయం చేసుకునే అవకాశం ఉందని, దీనిని వినియోగంతో పూర్వంలో గిరిజనులు ఎలాంటి వ్యాధుల బారిన పడలేదన్నారు. సమ్మక్క తల్లి గోత్రం బండాన్నీ అని కోయ భాషలో బండారి అని కూడా పిలుస్తారని మంత్రి తెలిపారు.
ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కొనసాగిన పూజలు
తరలొచ్చిన పూజారుల కుటుంబీకులు, ఆడపడుచులు
వైభవంగా ధ్వజస్తంభాల పునఃప్రతిష్ఠ వేడుక


