
మధ్యవర్తిత్వంతో వివాదాలు సులభంగా పరిష్కారం
వరంగల్ లీగల్ : మధ్యవర్తిత్వంతో వివాదాలు సులభంగా పరిష్కారమవుతాయని మీడియేషన్ అండ్ ఆర్బిట్రేషన్ సెంటర్ పాలకమండలి అధ్యక్షులు జస్టిస్ కె.లక్ష్మణ్, సభ్యులు జస్టిస్ జె.శ్రీనివాసరావు అన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఆయా జిల్లాల న్యాయసేవాధికాసంస్థలు గుర్తించిన మధ్యవర్తిత్వం భావన, సాంకేతికతలపై సాధికారత పొందిన న్యాయవాదుల ఐదు రోజుల శిక్షణా కార్యక్రమం గురువారం వరంగల్ టెన్ కోర్టు కాంప్లెక్స్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వారు వర్చువల్‌గా హాజరుకాగా తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సభ్య కార్యదర్శి సి.హెచ్. పంచాక్షరి ప్రత్యక్షంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ శ్రీనివాసరావు మాట్లాడుతూ మధ్యవర్తిత్వం ద్వారా రెండు పక్షాల వారికి సమయం, డబ్బు ఆదా అవడంతోపాటు శాంతి, సామరస్యంగా సమస్య పరిష్కారమవుతుందన్నారు. ఇది కక్షిదారుల చాలా ప్రయోజనం చేస్తుందన్నారు. అనంతరం శిక్షణ పొందిన న్యాయవాదులకు సభ్య కార్యదర్శి సి.హెచ్. పంచాక్షరి, వరంగల్, హనుమకొండ జిల్లాల ప్రధాన న్యాయమూర్తులు వి.బి నిర్మలా గీతాంబ, డాక్టర్ కె.పట్టాభిరామ్ చేతుల మీదుగా సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు నారాయణబాబు, మనీషా శ్రావణ్ ఉన్నమ్, వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయసేవాధికార సంస్థల కార్యదర్శులు సాయికుమార్, క్షమాదేశ్ పాండే, ఇతర న్యాయమూర్తులు, తదితరులు పాల్గొన్నారు.
జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ జె.శ్రీనివాస్‌రావు