కాకతీయ జూలాజికల్ పార్క్‌ను
సందర్శించిన జడ్జీలు
న్యూశాయంపేట: కాకతీయ జూలాజికల్ పార్క్‌లో అపరిశుభ్రత, రోగాల బారిన పడిన అడవి జంతువుల పరిస్థితిపై ‘వన్యప్రాణుల మూగరోదన’ శీర్షికన ‘సాక్షి’లో శుక్రవారం ప్రచురితమైన కథనానికి వరంగల్, హనుమకొండ జిల్లాల న్యా యసేవాధికార సంస్థ కార్యదర్శులు ఎం.సాయికుమార్, క్షమాదేశ్‌పాండేలు స్పందించారు. శనివారం వారు జూపార్క్‌ను పరిశీలించారు. బైసన్ (అడవి దున్న) ఎలా చనిపోయిందనే వివరాలను జూ వెటర్నరీ డాక్టర్‌ను అడిగి తెలుసుకున్నారు. జూపార్క్ నిర్వహణ సరిగ్గా లేదని, నిర్వాహకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని గుర్తించారు. వన్యప్రాణుల సంరక్షణపై నిర్లక్ష్యం తగదని హెచ్చరించారు. జూపార్క్‌లో ప్రవహిస్తున్న కలుషితమైన నీరు, పరిసరాలు అపరిశుభ్రతపై సరైన మార్గదర్శకాలు కనుగొని పరిష్కరించాలని సూచించారు. మూగ జంతువులను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. జడ్జిల వెంట అటవీ అధికారులు పి.సూరిదాస్ సింగ్, వెటర్నరీ డాక్టర్ కార్తికేయ,బీట్ ఆఫీసర్ శారద తదతరులు పాల్గొన్నారు.
వన్యప్రాణుల సంరక్షణపై నిర్లక్ష్యం తగదు