
దంపతుల మధ్య గొడవ
● కుమారుడికి తీవ్ర గాయాలు
● ఇంటికి నిప్పంటించిన భర్త
ఐనవోలు: దంపతుల మధ్య గొడవ ఇంటి దహనానికి దారి తీసింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం కక్కిరాలపల్లి వడ్డెరగూడేనికి చెందిన బోదాసు సాంబరాజు– రాజేంద్ర దంపతులు బండ కొట్టుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఆదివారం భార్యను కొడుతున్న క్రమంలో చిన్న కుమారుడి తల, చేతులకు గాయాలయ్యాయి. వెంటనే రాజేంద్ర తన కుమారుడిని ఆస్పత్రికి తీసుకెళ్లింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న సాంబరాజు తాను ఉంటున్న గుడిసెకు గ్యాస్ విప్పి నిప్పంటించాడు. ఈ ఘటనలో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పారు. భారీ ప్రమాదం తప్పడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంటి నుంచి పెద్ద శబ్దాలు రావడానికి గల కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. ఈ మేరకు సాంబరాజుపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. కాగా, సాంబరాజు గతంలో కాంప్రెషర్ బండి నడుపుతున్న క్రమంలో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై పస్తం శ్రీనివాస్ తెలిపారు.