
మట్టి వినాయకా.. మనసా స్మరామి
కాజీపేట : వినాయక చవితి దేశవ్యాప్తంగా నిర్వహించుకునే పండుగ. ఈ క్రమంలో నవరాత్రి వేడుకలకు ఇప్పటికే విగ్రహాల తయారీలో కళాకారులు నిమగ్నమయ్యారు. ఎలాంటి విగ్రహం ఏర్పాటు చేసుకోవాలి. ఎంత ఎత్తులో ఉండాలని గణపతి మండపాల నిర్వాహకులు సన్నాహాలు మొదలుపెట్టారు. ఇంత వరకు బాగానే ఉంది. మరి ఎలాంటి విగ్రహాన్ని ఎంచుకుందాం..? పర్యావరణానికి ఎటువంటి హాని కలగకుండా ఉండే మట్టి విగ్రహాలకు ప్రాధాన్యమిద్దామా..? ప్రకృతికి విఘాతం కలిగించే ప్లాస్టర్ ఆఫ్ పారిస్‌తో తయారు చేసిన వాటికి మొగ్గు చూపుదామా..? నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులు మట్టి గణనాథుల వైపు ఆసక్తి చూపించాలని ఆశిస్తూ ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
ఇతర రాష్ట్రాలకు చెందిన కళాకారులు మట్టితో సైతం భారీ విగ్రహాలను తయారు చేస్తున్నారు. నాలుగేళ్లుగా వందల సంఖ్యలో పూర్తి సహజ రంగులతో రూపొందించి, వాటిని విక్రయిస్తూ తమవంతుగా పర్యావరణాన్ని కాపాడుతూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. మహారాష్ట్ర, రాజస్థాన్ తదితర రాష్ట్రాల నుంచి కుటుంబ సభ్యులతో వలస వచ్చి వినాయక విగ్రహాల తయారీలో నిమగ్నమవుతున్నారు. మట్టి వినాయకులనే పూజించాలని కొంత కాలంగా ప్రచారం చేస్తుండడంతో సొంతంగా తయారు చేసి విక్రయించాలని నిర్ణయించుకున్నారు. మొదట పదుల సంఖ్యలో తయారు చేసి పండుగ రోజు విక్రయించే వారు. రెండేళ్ల నుంచి వారు చేస్తున్న మట్టి వినాయకులకు అనూహ్య స్పందన రావడంతో విగ్రహాల తయారీ విపరీతంగా పెరిగిపోయింది. చవితికి కొన్ని నెలల ముందుగానే పూర్తి సమయాన్ని విగ్రహాల తయారీకి కేటాయిస్తున్నారు. 4 నుంచి 9 అడుగుల ఎత్తును పెంచుకుంటూ విగ్రహాలను తయారు చేయడం ప్రారంభించారు. కొనుగోలు చేయడానికి ప్రజలు సైతం ముందుకు వస్తున్నారు. ఇక అప్పటి నుంచి మండపాల నిర్వాహకులు ఆర్డర్ ఇచ్చిన కొలతల ప్రకారం విగ్రహాలు రూపొందిస్తున్నారు. మహా రాష్ట్రలోని సిరొంచ నుంచి ప్రత్యేకంగా మట్టిని తీసుకొచ్చి రసాయనాలు లేని రంగులు వేస్తూ అందంగా తీర్చిదిద్దుతున్నారు.
పర్యావరణాన్ని రక్షిద్దాం..
ప్రకృతిని బతికిద్దాం
మొదలైన గణపతి నవరాత్రి ఉత్సవాల సందడి..

మట్టి వినాయకా.. మనసా స్మరామి