
ఎస్‌జీటీలకు ఎస్‌ఏలుగా పదోన్నతి
● సీనియార్టీ జాబితాల విడుదల
● నేడు వెబ్ ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం
విద్యారణ్యపురి: హనుమకొండ జిల్లాలో ఎస్‌జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా తత్సమానమైన పీఎస్ హెచ్‌ఎంలుగా పదోన్నతులు కల్పించే పక్రియలో భాగంగా సీనియారిటీ జాబితా వెల్లడించారు. తొలుత 1:3 నిష్పత్తిలో సీనియారిటీ జాబితా వెల్ల డించి అభ్యంతరాలు స్వీకరించారు. ఆదివారం 1:1 సీనియారిటీ జాబితా ప్రకటించారు. అందులో కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తున్నారు. ఈనెల 25న వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకునే అవకాశం కల్పించనున్నారు. ఈనెల 26న పదోన్నతులు పొందినవారికి ఉత్తర్వులు ఇవ్వనున్నారు. జిల్లాలో 147 ఎస్‌ఏల పోస్టులు ఖాళీగా చూపారు. అయితే, వివిధ కేటగిరీల్లో పదోన్నతులకు అర్హులైనవారు లేరు. అందులో 105 స్కూల్‌అసిస్టెంట్ పోస్టుల్లో ఎస్‌జీటీలకు పదోన్నతి కల్పించనున్నారు.
వరంగల్ జిల్లాలో..
వరంగల్ జిల్లాలో ఎస్‌జీటీలకు ఎస్‌ఏలుగా పదోన్నతుల ప్రక్రియకు సంబంధించి సీనియారిటీ జాబితా వెల్లడించడంలో జాప్యం జరిగింది. ఆదివారం 1:3 నిష్పత్తిలో ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితా వెల్లడించారు. అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు. మరోవైపు తుది జాబితాపై కూడా డీఈఓ కార్యాలయంలో సిబ్బంది కసరత్తు చేస్తున్నారు. 1:1 నిష్పత్తిలో సీనియారిటీ జాబితా సోమవారం వెల్లడించనున్నట్లు ఇన్‌చార్జ్ డీఈఓ రంగయ్యనాయుడు తెలిపారు. అదేరోజు ఉపాధ్యాయులకు వెబ్‌ఆప్షన్లకు అవకాశం ఇస్తారని భావిస్తున్నారు. జిల్లాలో పదోన్నతులకు 122 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు వేకెన్సీలుగా ఉన్నాయి.