
ర్యాగింగ్‌కు పాల్పడితే క్రిమినల్ చర్యలు
● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
వరంగల్ క్రైం: విద్యాసంస్థల్లో ఎవరైనా విద్యార్థులు ర్యాగింగ్ వంటి వికృత చేష్టలకు పాల్పడితే క్రిమినల్ చర్యలు తీసుకుంటామని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ హెచ్చరించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ర్యాగింగ్ నియంత్రణపై పోలీస్ కమిషనర్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. విద్యాసంస్థల్లో ర్యాగింగ్‌కు పాల్పడడం అనేది తీవ్రమైన నేరమని, ఈ చర్యలతో విద్యార్థుల భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని పేర్కొన్నారు. ర్యాగింగ్ నియంత్రణకు యాజమాన్యాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఇందులో భాగంగా యాంటీ ర్యాగింగ్ కమిటీలు, స్క్వాడ్‌లను ఏర్పాటు చేయాలని, నూతనంగా వచ్చిన విద్యార్థులపై ప్రత్యేక పర్యవేక్షణ ఉండాలని ఆయన సూచించారు. ముఖ్యంగా ర్యాగింగ్ వ్యతిరేక అవగాహన సదస్సులు, వర్క్‌షాపులు నిరంతరం నిర్వహించాలని, విద్యార్థులు ఫిర్యాదు చేసేందుకు 24గంటల హైల్ప్‌లైన్ నంబర్లను విద్యాసంస్థల యాజమాన్యం అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ఎవరైనా ర్యాగింగ్‌కు గురైతే తక్షణమే ప్రిన్సిపాల్, యాజమాన్యం, పోలీసులకు సమాచారం అందించాలని సీపీ కోరారు. విద్యాసంస్థల యాజమాన్యాలు, అధ్యాపకులు, విద్యార్థులు, పోలీసులు కలిసి పనిచేసినప్పుడే ర్యాగింగ్ సంస్కృతిని పూర్తిగా నిర్మూలించగలమని పోలీస్ కమిషనర్ తెలిపారు.