
యూనిట్ల ఏర్పాటుపై దృష్టి సారించాలి
రామన్నపేట: పట్టణ సమాఖ్యలు ఆదాయాన్ని పెంచే యూనిట్ల ఏర్పాటుపై దృష్టి సారించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. బుధవారం భీమారంలోని కమ్యూనిటీ రిసోర్స్ సెంటర్‌లో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించిన రుద్రమ దేవి టీఎల్‌ఎఫ్ నెలవారీ సమావేశానికి కమిషనర్ హాజరయ్యారు. ఈసందర్భంగా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ.. పట్టణ సమాఖ్యలు రెగ్యులర్‌గా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు పొదుపులు సక్రమంగా నిర్వహించాలని, లోన్లకు సంబంధించి రీ పేమెంట్లు గడువులోగా చెల్లించాలని సూచించారు. లావాదేవీలకు చెందిన బుక్స్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని, నగరంలోని 13 టీఎల్‌ఎఫ్ యూనిట్లు ఉన్నట్లు, వీటికి ఆదాయం పెంచేలా ప్రతి టీఎల్‌ఎఫ్ ఒక పెద్ద యూనిట్‌ను ఏర్పాటు చేయాలని సూచించారు. నగరంలో చాలా ఫంక్షన్ హాళ్లు ఉన్నాయని అందుకు అనుగుణంగా ఈవెంట్ మేనేజ్‌మెంట్‌ను ప్లాన్ చేస్తే లాభసాటిగా ఉంటుందన్నారు. అనంతరం టీఎల్‌ఎఫ్ సభ్యులు కమిషనర్‌ను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో టీఎంసీలు రమేశ్, వెంకట్‌రెడ్డి, కమ్యూనిటీ ఆర్గనైజర్లు సకినాల రమేశ్, సునీల్, రుద్రమాదేవి పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు రజనీ, ఆర్పీలు, ఓబీలు పాల్గొన్నారు.
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్