స్వర్ణోత్సవంలోకి కేయూ.. | - | Sakshi
Sakshi News home page

స్వర్ణోత్సవంలోకి కేయూ..

Aug 19 2025 4:27 AM | Updated on Aug 19 2025 4:27 AM

స్వర్

స్వర్ణోత్సవంలోకి కేయూ..

యూనివర్సిటీ ఆవిర్భవించి 49 వసంతాలు పూర్తి

కేయూ క్యాంపస్‌ : కాకతీయ యూనివర్సిటీ.. నిత్య చైతన్య దీప్తిగా ఉంటూ ఎంతో మంది విద్యార్థులను విద్యావంతులుగా తీర్చిదిద్దిన చదువులమ్మ ఒడి. అంతేకాకుండా ఉద్యమాల గడ్డ.. పోరాటాల అడ్డగా పేరొందింది. ఈ క్రమంలో యూనివర్సిటీ మంగళవారం 50వ వసంతంలోకి అడుగిడబోతోంది. రాష్ట్రంలో ఉస్మానియా తర్వాత ప్రతిష్టాత్మక యూని వర్సిటీగా కేయూ గుర్తింపు పొందింది. న్యాక్‌ ఏప్లస్‌ గ్రేడ్‌ సాధించి విద్యార్థుల ప్రాధాన్య యూనివర్సిటీగా మారింది. ఈ నేపథ్యంలో ఈనెల 19వ తేదీతో 49 సంవత్సరాలు పూర్తిచేసుకుని స్వర్ణోత్సవంలోకి అడుగుపెట్టబోతోంది. ఈ సందర్భంగా యూనివర్సిటీ ప్రస్థానం, ఇక్కడ నెలకొన్న సమస్యలు, కావాల్సిన సదుపాయాలపై ‘సాక్షి’ ప్రత్యేకథనం.

తొలుత ఓయూ పీజీ సెంటర్‌గా..

తొలుత ఉస్మానియా యూనివర్సిటీ పీజీ సెంటర్‌గా 1968లో ప్రారంభమైంది. 1976 ఆగస్టు 19న కాకతీయ యూనివర్సిటీ ఆవిర్భవించింది. ఈ 49 ఏళ్లలో ఎంతోమంది విద్యార్థులను తీర్చిదిద్దింది. ఎంతో మంది వివిధ రంగాల్లో స్థిరపడ్డారు. అయితే ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన కేయూ.. నేడు అనేక సమస్యలతో సతమవుతోంది. పాఠాలు బోధించేందుకు వివిధ విభాగాల్లో రెగ్యులర్‌ ప్రొఫెసర్ల కొరత ఉంది. ఒకప్పుడు కేయూలో సీనియర్‌ ప్రొఫెసర్లతో విద్యతోపాటు పరిశోధనలు విస్తృతంగా జరిగేవి. ఇది అంతా గతం. తెలంగాణ ఆవిర్భావంతో యూనివర్సిటీ అభివృద్ధిలో పయనిస్తుందని భావించారు. కానీ సమస్యలు పరిష్కారం కాకపోగా గత ప్రభుత్వం ప్రైవేట్‌ యూనివర్సిటీలను తీసుకొచ్చి ప్రభుత్వ యూనివర్సిటీలను నిర్వీర్యం చేసిందని విద్యావేత్తలు ఆరోపిస్తున్న విషయం విధితమే. కేయూ నిధుల లేమితో ఇంకా అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది.

నాలుగు విభాగాలతో మొదలై..

28 విభాగాల వరకు..

కాకతీయ యూనివర్సిటీ తొలుత నాలుగు విభాగాలతో మొదలై అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం 28 విభాగాలతో కొనసాగుతోంది. మూడు ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాలోని 11 జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. ప్రభుత్వ, ఎయిడెడ్‌, ప్రైవేట్‌, అటానమస్‌ డిగ్రీ కళాశాలలు 211 ఉండగా, యూనివర్సిటీ పీజీ కళాశాలలు 74, ఇంజనీరింగ్‌ 6, ఫార్మసీ 25, ఎడ్యుకేషన్‌ 41, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ 3, ‘లా’ కళాశాలలు 3, ఎంబీఏ 24, ఎంసీఏ 7, హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాలలు 3 ఉన్నాయి. ఇటీవల కేయూ పరిధిలోని కొత్తగూడెం మైనింగ్‌ ఇంజనీరింగ్‌ కాలేజీని ఎర్త్‌ యూనివర్సిటీగా ఏర్పాటు చేసిన విషయం విధితమే.

బోధన అంతంత మాత్రమే..

కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థులకు బోధన అంతంతమాత్రంగానే ఉంటుంది. రెగ్యులర్‌ అసిస్టెంట్‌, అసోసియేట్‌, ప్రొఫెసర్లు కలిపి 77 మంది మాత్రమే ఉన్నారు. వీరిలో కొందరికి రెండు, మూడు, నాలుగైదు పరిపాలన పదవులు కూడా ఉండడంతో వారు బోధనపై అంతగా దృష్టిసారించడం లేదనే ఆరోపణలున్నాయి. కొన్ని విభాగాల్లో ఒక్క రెగ్యులర్‌ అధ్యాపకుడు కూడా లేరు. ఉదాహరణకు తెలుగు, పొలిటికల్‌ సైన్స్‌, విద్యా, ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కళాశాలలు, సైకాలజీ, జర్నలిజం విభాగాలున్నాయి. ఎకనామిక్స్‌, హిస్టరీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, బాటనీలో విభాగాల్లో ఒక్కొక్కరే రెగ్యులర్‌ ప్రొఫెసర్‌ ఉన్నారు.

కాంట్రాక్టు, పార్ట్‌టైం లెక్చరర్లతోనే బోధన..

కేయూలో 176 మంది వరకు కాంట్రాక్టు లెక్చరర్లు,183 మంది వరకు పార్ట్‌టైం లెక్చరర్లు ఉన్నారు. అయినా వివిధ విభాగాలు, యూనివర్సిటీ కాలేజీలో వర్క్‌లోడ్‌కు అనుగుణంగా ఇటీవలే పేపర్‌వైజ్‌గా విద్యాబోధనకు తాత్కాలిక పద్ధతిలో కొందరిని నియమించారు.

వేధిస్తున్న అధ్యాపకుల కొరత..

కేయూలో ప్రధానంగా రెగ్యులర్‌ అధ్యాపకుల కొరత వేధిస్తోంది. అన్ని విభాగాలు కలిపి (అసిస్టెంట్‌, అసోసియేట్‌, ప్రొఫెసర్‌) 409 పోస్టుల మంజూరు ఉండగా ప్రస్తుతం 77మంది అధ్యాపకులే ఉన్నారు.

పీజీ సెంటర్లను పట్టించుకునే వారేరి?

కేయూ పరిధిలోని పీజీ సెంటర్లను పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. 2012–2013లో ఏర్పాటు చేసిన మహబూబాబాద్‌, జయశంకర్‌ భూపాలపల్లి, జనగామ జిల్లాలోని పీజీసెంటర్లులో ఒక్క రెగ్యులర్‌ లెక్చరర్‌ లేరు. ప్రిన్సిపాల్‌ కూడా లేరు. పేరుకు యూనివర్సిటీలోని వైస్‌ ప్రిన్సిపాల్‌కే ఇన్‌చార్జ్‌ అని ఇస్తున్నారు. కానీ వారు కూడా వెళ్లడం లేదు. బోధించేవారు అంతంత మాత్రమే. దీంతో అడ్మిషన్ల సంఖ్యతగ్గిపోతోంది. నిర్మల్‌ పీజీ సెంటర్‌ ఇప్పటికే మూతపడిందని భావిస్తున్నారు. ఖమ్మం పీజీ సెంటర్‌లో కూడా రెగ్యులర్‌ అధ్యాపకుల కొరత ఉంది.

ఫీజుల భారం..

మూడేళ్లక్రితం కేయూలోని పీజీ, ప్రొఫెషనల్‌ ఎస్‌ఎఫ్‌సీల్లో అదనపు సీట్లు పెంచడంతోపాటు ఫీజులు కూడా భారీగా పెంచారు. అయితే ప్రభుత్వ నుంచి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఫీజురీయిబర్స్‌మెంట్‌ కింద వర్సిటీకి రూ. 50కోట్లకు పైగానే బకాయిలు రావాల్సి ఉందని సమాచారం.

విద్యార్థుల ప్రధాన సమస్యలు..

కేయూలో ఎస్‌ఎఫ్‌సీలను రెగ్యులర్‌గా మార్చాలని విద్యార్థులు ఎప్పటి నుంచో కోరుతున్నారు. అలాగే, విద్యార్థులకు హాస్టల్‌ వసతి కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. హాస్టళ్ల భవనాలు సరిపడాలేకపోవడంతో విద్యార్థులు బయట ప్రైవేట్‌గా ఉంటుండడంతో ఆర్థిక భారం పడుతుంది. క్యాంపస్‌లోని రెండు ఇంజనీరింగ్‌ కాలేజీల్లోనూ రెగ్యులర్‌ అధ్యాపకుల నియమించాల్సింది. ఇంజనీరింగ్‌ విద్యార్థినులకు హాస్టల్‌ వసతి అవసరం ఉంది.

మౌలిక వసతులకు రూ. 300 కోట్లకు ప్రతిపాదనలు..

కాకతీయ యూనివర్సిటీ 50 వసంతంలోకి అడుగిడబోతుంది. దీంతో వచ్చే ఆగస్టు వరకు గోల్డెన్‌జూబ్లీ ఉత్సవాల్లో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టనున్నాం. యూనివర్సిటీలో అకడమిక్‌, నాణ్యమైన పరిశోధనల పరంగా మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా అడుగులు వేయబోతున్నాం. ఇందులో భాగంగా యూనివర్సిటీలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ. 300 కోట్లతో ప్రభుత్వానికి ఇప్పటికే ప్రతిపాదనలు పంపాం. – కె.ప్రతాప్‌రెడ్డి, వీసీ, కేయూ

నేడు 50వ వసంతంలోకి..

న్యాక్‌ ఏ ప్లస్‌ గ్రేడ్‌ సాధించినా సమస్యలే

వేధిస్తున్న రెగ్యులర్‌ అధ్యాపకుల కొరత

బోధన, పరిశోధనలపై తీవ్ర ప్రభావం

పీజీ సెంటర్లను పట్టించుకునే నాఽథుడు కరువు

నాన్‌ టీచింగ్‌ ఉద్యోగుల పోస్టులు కూడా వెకెన్సీలు

గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ ఉద్యోగుల పోస్టులు 29కి 22మంది పనిచేస్తున్నారు. ఎన్‌జీఓ కేడర్‌ ఉద్యోగుల పోస్టుల మంజూరు 240 ఉండగా 115 వెకెన్సీలుగా ఉన్నాయి. క్లాస్‌ ఫోర్త్‌ ఎంప్లాయీస్‌ పోస్టులు మంజూరు 225 ఉండగా 78 మంది పనిచేస్తున్నారు. ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు 507మంది పనిచేస్తున్నారు. కాగా, ఉద్యోగులకు ఫేస్‌రికగ్నైషన్‌ హాజరు వచ్చే నెలలో అమలు చేయాలని వీసీ ప్రతాప్‌రెడ్డి నిర్ణయించారు.

స్వర్ణోత్సవంలోకి కేయూ..1
1/1

స్వర్ణోత్సవంలోకి కేయూ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement