
పాపన్న గౌడ్ జయంతి రసాభాస
హన్మకొండ: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి కార్యక్రమం రసాభాసగా సాగింది. సోమవారం హనుమకొండ కలెక్టరేట్‌లో అధికారికంగా పాపన్న గౌడ్ జయంతిని నిర్వహించింది. కలెక్టర్ స్నేహ శబరీష్ పాల్గొనకపోవడంపై అసహనం వ్యక్తం చేస్తూ బీసీ సంఘాల నాయకులు ఆందోళనకు దిగా రు. బీసీ సంఘం నాయకులు బొనగాని యాదగిరి గౌడ్, సుందర్ రాజ్ యాదవ్, ఇతర బీసీ నాయకులు మాట్లాడుతూ కలెక్టర్.. బీసీల పట్ల చిన్నచూపు చూస్తున్నారని మండిపడ్డారు. కలెక్టర్ రావాల్సిందేనని అక్కడున్న అధికారులతో గొడవకు దిగారు. ఈ క్రమంలో జయంతి వేడుకలు ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకేనని, కార్యక్రమం ముగిసిందని, ప్రజావాణి నిర్వహించాల్సి ఉందని అధికారులు తెలపగా, తాము కలెక్టరేట్ ముందు రోడ్డుపై జయంతి జరుపుకుంటామని, ఈ ఫొటోలు, సమాచారం సీఎం, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపుతామని హెచ్చరించారు. గొడవ పెద్దదవుతుందని తెలియడంతో కలెక్టర్ స్నేహ శబరీష్ కాన్ఫరెన్స్ హాల్‌కు చేరుకుని పాపన్న గౌడ్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. దీంతో బీసీ సంఘాల నాయకులు శాంతించారు. సోమవారం గ్రీవెన్స్ ఉన్నందున ప్రజలకు ఇబ్బంది కలగరాదని ఉద్దేశంతో ఆలోగా కార్యక్రమం పూర్తి చేయాలని చెప్పామని, ఏదైనా విషయం ఉంటే రాతపూర్వకంగా ఇవ్వండని బీసీ సంఘాల నాయకులకు కలెక్టర్ సూచించినట్లు సమాచారం. అనంతరం బీసీ సంఘాల నాయకులతో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వై.వి. గణేశ్, డీఆర్‌డీఓ మేన శ్రీను, ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, డాక్టర్ కె.నారాయణ, జిల్లా బీసీ సంక్షేమాధికారి లక్ష్మణ్, బీసీ సంఘాల నాయకులు చిర్ర రాజు, శ్యామ్ యాదవ్, జనగామ శ్రీనివాస్ గౌడ్, మార్క విజయ్ గౌడ్, రామస్వామి గౌడ్, బూర విద్యాసాగర్, మౌనిక, తది తరులు పాల్గొన్నారు.
హనుమకొండ కలెక్టర్ రాకపోవడంపై బీసీల అసహనం

పాపన్న గౌడ్ జయంతి రసాభాస