Telangana News: రాత్రి అయిందా కదా సార్‌ రేపు తీసుకొస్తాం.. పాపను మాతో పంపించండన్నా.. వినని పోలీసు అధికారి..!
Sakshi News home page

పాపను మాతో పంపించండన్నా.. వినని పోలీసు అధికారి..!

Published Wed, Nov 22 2023 1:06 AM | Last Updated on Wed, Nov 22 2023 9:42 AM

- - Sakshi

సాక్షి, వరంగల్‌: మైనర్‌ను పెళ్లి చేసుకుని భద్రత కోసం వచ్చిన ఓ వ్యక్తికి వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ పోలీసులు అనుకూలంగా వ్యవహరించడం సంచలనంగా మారింది. పుట్టిన తేదీకి ఆధార్‌ కార్డు ఆధారం కాదంటూ సుప్రీంకోర్టు చెప్పినా అదే ఆధార్‌ కార్డును ఆసరా చేసుకుని సదురు బాలికను మేజర్‌గా గుర్తించి మరీ అతడి వెంట పంపడం పోలీసుల పనితీరుపై విమర్శలు వస్తున్నాయి.

మహిళల భద్రత విషయంలో ఎక్కడా తగ్గేదే లేదని ఓవైపు ప్రభుత్వం చెబుతుంటే.. అందుకు విభిన్నంగా చెన్నారావుపేట పోలీసులు అది కూడా స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ వ్యవహరిస్తున్నారు. కనీసం బాధితురాలి తల్లిదండ్రుల మాటలు పట్టించుకోకపోవడం తెరవెనుక ఏం జరిగి ఉంటుందనే చర్చ జోరుగా జరుగుతోంది. పాపను తమ వెంట పంపకుండా.. ఎక్కడ భద్రత కల్పిస్తారంటే సదరు ఎస్సై కనీస సమాధానం ఇవ్వకపోవడంతో మంగళవారం రాత్రంతా ఆ తల్లిదండ్రులకు జాగారం చేస్తూ బోరున విలపించారు.

అన్ని ధ్రువపత్రాలు సమర్పించినా ససేమిరా..
దాదాపు 30 ఏళ్లున్న వ్యక్తితో బాలికకు వివాహం జరిగితే వాస్తవం తెలుసుకోకుండా సదరు పోలీసు అధికారి ఏకపక్షంగా వ్యవహరించడంతో బాలికల భద్రత చట్టం సరిగా అమలు అవుతుందా? లేదా అనే చర్చ జరుగుతోంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. చెన్నారావుపేట మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఓ బాలిక(15)కు 30 ఏళ్ల వ్యక్తి మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడు.

అనంతరం పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి రక్షణ కల్పించాలని కోరారు. ఆ వెంటనే బాలిక తల్లిదండ్రులకు సమాచారం అందడంతో ఠాణాకు వెళ్లి తమ పాప బాలికనని తెలిపారు. దీనికి ఆధారంగా ఆధార్‌ కార్డు చూపించినా అదీ చెల్లదన్నారు. బాలిక పుట్టిన తేదీ, బాలిక జన్మించినప్పటి దవాఖాన డిశ్చార్జ్‌ కార్డు చూపించినా సదరు అధికారి తిరస్కరించారు.

బాలిక చదివిన పాఠశాలలో స్టడీ సర్టిఫికెట్‌ తీసుకురమ్మని చెప్పగా ‘రాత్రి అయిందా కదా సార్‌ రేపు తీసుకొస్తాం. పాపను మాతో పంపించండన్నా’ స్పందించలేదు. ఆ తర్వాత తల్లిదండ్రులను అక్కడి నుంచి పంపిన అనంతరం బాలికను ఆ వ్యక్తితోనే పంపించారు. మంగళవారం సాయంత్రం వరకూ బాలిక ఆచూకీ లభించకపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

నిబంధనలు ఏంటీ..
బాలల న్యాయ చట్ట ప్రకారం.. 18 సంవత్సరాలు లోపు బాలల విషయాలు పోలీసుల దృష్టికి వస్తే వెంటనే చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ, చైల్డ్‌ హెల్ప్‌ లైన్‌, బాలల సంరక్షణ విభాగాలకు సమాచారం అందించాలి. సదరు అధికారులు బాలుడు లేదా బాలిక స్థితిగతులు తెలుసుకుని చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ ఎదుట హాజరుపరిచి వారి ఆదేశాలకు అనుకూలంగా వ్యవహరిస్తారు. కానీ ఇక్కడ అలాంటిదేమీ జరగలేదు.

పోలీసులు ఏకంగా పెళ్లి చేసుకున్న వ్యక్తి వెంట సదరు బాలికను పంపించడం తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. సీడబ్ల్యూసీ ముందుకువస్తే ఆ బాలికతో మాట్లాడి సఖి కేంద్రానికి పంపి కౌన్సెలింగ్‌ ఇస్తారు. లేదంటే తల్లిదండ్రులతోని వెళ్తానంటే పంపిస్తారు. అయితే ఇక్కడ అవేమీ జరగకుండా పోలీసులు నిర్ణయం తీసుకుని బాలికను ఆ వ్యక్తితో పంపడంతో ఆమె పరిస్థితి ఎలా ఉందనే టెన్షన్‌ తల్లిదండ్రుల్లో నెలకొని ఉంది.

విచారణ చేపట్టిన చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ..
ఈ విషయం తెలిసి తల్లిదండ్రులు పోలీసులను కలిసి వచ్చిన అనంతరం మండల స్థాయి ఐసీడీఎస్‌ అధికారులు చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీకి సమాచారం అందించగా వారు గ్రామానికి చేరుకొని విచారణ చేపట్టారు.

సదరు బాలికకు 15 సంవత్సరాలు మాత్రమే ఉండగా, చట్ట విరుద్ధంగా వ్యక్తి పెళ్లి చేసుకున్నాడని, బాలిక ఆచూకీ సైతం లేదని సీడబ్ల్యూసీ కమిటీని ఆశ్రయించి తమకు న్యాయం చేయాలని తల్లిదండ్రులు కోరారు. కాగా, బాలల న్యాయ చట్టాలను ఉల్లంఘించిన సదరు పోలీసు అధికారిపై చర్యలు తీసుకోవాలని పలువురు బాలల హక్కుల కార్యకర్తలు కోరుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement