తాగునీటిపై కసరత్తు
రిజర్వాయర్లలో 4 నెలలకు
సరిపడా నిల్వలు
వరంగల్ అర్బన్ : వేసవి సమీపిస్తున్న నేపథ్యంలో వరంగల్ మహానగరంలో తాగునీటి సరఫరాపై మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ దృష్టి సారించారు. ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై మంగళవారం గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యాలయంలో పబ్లిక్ హెల్త్, మిషన్ భగీరథ, బల్దియా ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు. నగరానికి తాగునీటిని సరఫరా చేసే రిజర్వాయర్లలో ప్రస్తుతం నీటి లభ్యత, వాటిని సమర్థవంతంగా వినియోగించుకునే ఆంశమై ఇంజనీరింగ్ అధికారుల నుంచి సలహాలు, సూచనలు తీసుకున్నారు.
సమ్మర్ యాక్షన్ ప్లాన్‌కు ఆదేశాలు
సమ్మర్ యాక్షన్ ప్లాన్‌కు యుద్ధప్రాతిపదికన రూపొందించాలని మేయర్, కమిషనర్ సూచించారు. ఆయా ఇంజనీరింగ్ విభాగాల అధికారులు పరస్పర సహకారంతో ప్రణాళికలు రూపొందించాలన్నారు. నిల్వలను ఎప్పటికప్పుడు గుర్తిస్తుండాలన్నారు. ధర్మసాగర్, వడ్డేపల్లి, కేయూ, దేశాయిపేట ఫిల్టర్ బెడ్‌లలో మరమ్మతులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ఫిల్టర్ బెడ్‌లలో రసాయనాలను అందుబాటులో ఉంచుకోవాలని, రా వాటర్ శుద్ధీకరణపై ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. నీటి సరఫరాలో సమయపాలన పాటించాలని, లీకేజీలను వెంటనే అరికట్టి అవాంతరాలు లేకుండా చూడాలని పేర్కొన్నారు. అనివార్య కారణాల వల్ల నగరంలోని కొన్ని ప్రాంతాల్లో నీటి సరఫరాలో ఆటంకాలు ఏర్పడితే మీడియా ద్వారా సంబంధిత ప్రాంత ప్రజలకు తెలియజేసి ప్రత్యామ్నాయంగా వాటర్ ట్యాంకర్ల ద్వారా నీటిని అందించాలని తెలిపారు. మురికివాడల్లో బోర్ల మరమ్మతులు, పైపులైన్ లేని ఏరియాల్లో వాటర్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలన్నారు. గత వేసవిలో మాదిరిగా ప్రధాన కూడళ్లు, జనావాస ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి, తాగునీరు అందించాలని సూచించారు. సమీక్ష సమావేశంలో బల్దియా ఇన్‌చార్జ్, పబ్లిక్‌హెల్త్ ఎస్‌ఈ ఎన్.శ్రీనివాస్, ఈఈలు మహేందర్, రవికుమార్, సంతోష్ బాబు, మాధవి లత, డీఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.
వేసవిలో ఇబ్బందులు రాకుండా
ముందస్తు యాక్షన్‌ప్లాన్
మేయర్ సుధారాణి, కమిషనర్
చాహత్ బాజ్‌పాయ్ దిశానిర్దేశం
సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని ఇంజనీర్లకు ఆదేశాలు
గ్రేటర్ వరంగల్‌లో మంచినీటి
సరఫరాపై సమీక్ష
నగర ప్రజలకు రోజుకు 160 ఎంఎల్‌డీ(మిలియన్ ఫర్ డే) నీరు అవసరమవుతోంది. ప్రస్తుతం ధర్మసాగర్, వడ్డేపల్లి రిజర్వాయర్లలో ఉన్న నీటి నిల్వలు 4 నెలలకు సరిపడా ఉన్నట్లు బల్దియా ఇంజనీర్లు వెల్లడించారు. అదేవిధంగా దేవాదులనుంచి పంపింగ్ ఉంటుందని, ఎల్‌ఎండీ నుంచి మిషన్ భగీరథ వాటర్ సరఫరా జరుగుతుంది. దీంతో ఈ వేసవి కాలంలో 66 డివిజన్‌ల పరిధిలోని 11 లక్షలమందికిపైగా ఉన్న జనాభాకు నీటి సరఫరాలో ఆరు నెలలపాటు ఎలాంటి ఢోకా ఉండదని స్పష్టం చేస్తున్నారు.
తాగునీటిపై కసరత్తు


