ప్రకృతి సాగుకు ప్రోత్సాహం
హన్మకొండ: సంప్రదాయ సాగును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. ప్రకృతి వ్యవసాయాన్ని శాసీ్త్రయ దృక్పథంతో పునరుద్ధరించడం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతూ రైతు కుటుంబాలు, వినియోగదారులకు రసాయనాల అవశేషాలు లేని ఆరోగ్యకర ఆహారాన్ని అందుబాటులోకి తేవాలనే లక్ష్యంతో జాతీయ ప్రకృతి వ్యవసాయ పథకాన్ని (నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్) పథకాన్ని తీసుకొచ్చాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ పథకాన్ని రాష్ట్రంలో రెండు సంవత్సరాలపాటు అమలు చేయనున్నాయి. హనుమకొండ జిల్లాలోని 10 మండలాల్లో 10 గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఒక్కో గ్రామాన్ని క్లస్టర్ (సమూహం)గా గుర్తించారు. ఒక్కో సమూహంలో 125 మంది రైతులను ఎంపిక చేశారు. ఒక్కో సమూహంలో 125 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయాన్ని చేసేలా రైతులను ప్రోత్సహిస్తారు. ప్రకృతి వ్యవసాయంలో రసాయనాలు, ఎరువులు, పురుగుమందులు వాడరు. ప్రకృతి సిద్ధమైన పద్ధతుల్లో జీవామృతం, ఘనజీవామృతం, ఆచ్ఛాదన, వాపస వంటివి వాడుతూ చేసే వ్యవసాయ విధానం. ఇది భూసారాన్ని పెంచి, తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడిని ఇస్తుంది. పర్యావరణ పరిరక్షణతోపాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించే ఈ విధానంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాయి.
జిల్లాలో 7 బయోరిసోర్స్ సెంటర్స్..
ప్రతి మండలం నుంచి ఇద్దరు చొప్పున మొత్తం 10 మండలాలకు 20 మంది కృషి సఖిల (క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్)ను ఎంపిక చేశారు. ముందుగా పురుషులు, మహిళలు ఎవరినైనా ఎంపిక చేయొచ్చని చెప్పిన ప్రభుత్వం తర్వాత మహిళళా రైతులను మాత్రమే ఎంపిక చేయాలని సూచించింది. ఈ మేరకు 20 మంది మహిళా రైతులను కృషి సఖిలుగా ఎంపిక చేసింది. వీరికి ప్రకృతి వ్యవసాయంపై ఈనెల నాలుగు నుంచి హనుమకొండ భీమారంలోని రైతు వేదికలో ఐదు రోజులపాటు శిక్షణ ఇస్తారు. వీరు శిక్షణ పొందిన అనంతరం గ్రామాల్లో రైతులకు ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ ఇచ్చి అవగాహన కల్పిస్తారు. ఎంపిక చేసిన 125 మంది రైతుల పొలాల్లో నుంచి మట్టి పరీక్ష కోసం మట్టి నమూనాలు సేకరించి ల్యాబ్‌కు పంపారు. జిల్లాలో 7 బయోరిసోర్స్ సెంటర్స్ ఏర్పాటు చేస్తారు. మహిళా స్వయం సహాయక సంఘాలు, రైతు ఉత్పత్తి కేంద్రాలను బయోరిసోర్స్ సెంటర్‌గా ఎంపిక చేశారు. వీటి ద్వారా ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన జీవామృతం, ఘనజీవామృతం, ఆచ్ఛాదన, వాపస వంటి సహజ సిద్ధమైన ఎరువులను రైతులకు అందిస్తారు. ఈ పథకంలో భాగంగా ప్రతి రైతుకు రూ.4 వేలు చెల్లిస్తారు.
పైలట్ ప్రాజెక్టుగా హనుమకొండ
జిల్లాలోని 10 మండలాల్లో
10 గ్రామాల ఎంపిక
ఒక్కో గ్రామంలో 125 మంది
రైతుల గుర్తింపు
సహజసిద్ధమైన ఎరువులు
అందించనున్న ప్రభుత్వాలు
మండలానికి ఇద్దరు కృషి సఖిల
ఎంపిక.. నేటి నుంచి శిక్షణ


