నేడు తిరుగువారం పండుగ
ఎస్‌ఎస్ తాడ్వాయి: మేడారం, కన్నెపల్లి ఆలయాల్లో సమ్మక్క– సారలమ్మకు బుధవారం పూజారులు తిరుగువారం పండుగ నిర్వహించనున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేశారు. తిరుగువారం పండుగలో భాగంగా మేడారం, కన్నెపల్లి అమ్మవార్ల ఆలయాలను పూజారులు శుద్ధి చేసి ధూపదీపాలు వెలిగించి యాటను నైవేద్యంగా సమర్పిస్తారు. అనంతరం పూజారుల కుటుంబీకులు, స్థానిక ఆదివాసీలు, గిరిజనేతరులు అమ్మవార్ల ఆలయాలకు చేరుకుని మొక్కులు చెల్లించనున్నారు. అనంతరం పూజారులు అమ్మవార్ల పూజాసామగ్రి, వస్త్రాలను తిరిగి ఆలయాల్లో భద్రపర్చనున్నారు. తిరుగువారం పండుగతో మహాజాతర పూజా కార్యక్రమాల తంతు ముగియనుంది. తిరుగువారం పండుగ సందర్భంగా భక్తులు కూడా అధిక సంఖ్యలో వచ్చి అమ్మవార్లను దర్శించుకోనున్నారు.
పుణ్యస్నానాలు.. మొక్కులు
జాతర ముగిసి మూడు రోజులు గడిచినా మేడారానికి భక్తులు వస్తూనే ఉన్నారు. మంగళవారం భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, కానుకలు, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల వద్ద పూజలు చేశారు.


