ఏఎన్‌యూ (పెదకాకాని): ఉన్నత విద్యకు బీజం వేసిన ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఐదు దశాబ్దాల ప్రస్థానంలో విద్య, పరిశోధన, క్రీడలు, సాంస్కృతిక రంగాల్లో విశిష్ట గుర్తింపును సొంతం చేసుకుందని ఇన్‌చార్జి వీసీ ఆచార్య కె. గంగాధరరావు అన్నారు. ఏఎన్‌యూలో ఇన్‌చార్జి వీసీ మాట్లాడుతూ 1976లో ప్రారంభమైన విశ్వవిద్యాలయం ప్రస్తుతం స్వర్ణోత్సవాలు జరుపుకొంటోందన్నారు. వేడుకల్లో భాగంగా స్వర్ణోత్సవ స్మారక చిహ్నం ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించనున్నట్లు, ఈ మేరకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. గవర్నర్, విశ్వవిద్యాలయం కులపతి జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని పేర్కొన్నారు. వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా గురువారం సచివాలయంలో ఆవిష్కరించారు. విద్యాశాఖ కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్య కమిషనర్ నారాయణ భరత్ గుప్తా, వర్సిటీ ఇన్‌చార్జి వీసీ ఆచార్య కె. గంగాధరరావు, ఇన్‌చార్జి రెక్టార్ ఆచార్య ఆర్. శివరాం ప్రసాద్, రిజిస్ట్రార్ ఆచార్య జి. సింహాచలం తదితరులు పాల్గొన్నారు.


