గుంటూరు ఎడ్యుకేషన్: ప్రభుత్వం విడుదల చేసిన టెట్‌ను 40 శాతం పాస్ మార్కులతో ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించాలని ఏపీటీఎఫ్ గుంటూరు జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శలు గుడిపాటి దాస్, మహమ్మద్ ఖాలీద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం కన్నావారితోటలోని ఏపీటీఎఫ్ జిల్లా కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. దాస్ మాట్లాడుతూ ఉపాధ్యాయులందరికీ టెట్ నుంచి మినహాయింపు నివ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే రాసిన టెట్‌కు కనీసం ఫైనల్ కీ ఇవ్వకుండానే మరో టెట్ నోటిఫికేషన్ ఇవ్వడమే కాక, ఇచ్చిన స్పెషల్ టెట్‌లో ఎలాంటి సడలింపులు ఇవ్వకపోవడం సరైనది కాదన్నారు. క్వాలిఫైయింగ్ మార్కులు 90, 75, 60 స్థాయిలో కాకుండా, అందరికీ సమానంగా 40 శాతం పాస్ మార్కులుగా ఉంచాలన్నారు. మహ్మద్ ఖాలీద్ మాట్లాడుతూ లెక్కలు, సైన్సు సబ్జెక్టులు వారు సబ్జెక్టులు కాకుండా వేరే సబ్జెక్టులు చదివి టెట్‌లో ఉత్తీర్ణులు కావాలనడం ఉపాధ్యాయులను వేధింపులకు గురిచేయడమేనని అన్నారు. సమావేశంలో సంఘ జిల్లా కార్యదర్శులు పి.లక్ష్మీ నారాయణ, పి.శివరామకృష్ణ, వట్టిచెరుకూరు ప్రధాన కార్యదర్శి బి.గురుమూర్తి, సీనియర్ కార్యకర్త సాధనాల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు వెస్ట్(క్రీడలు): శ్రీకాకుళం జిల్లా తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి నిర్వహించిన అంతర్ జిల్లాల తైక్వాండో చాంపియన్‌షిప్ 2026 పోటీల్లో గుంటూరు జిల్లా క్రీడాకారులు అద్భుత ప్రతిభ కనబరచారని న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ జిల్లా కార్యదర్శి బి.కాశీనాథ్ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ (నాప్తా) నిర్వహించిందని చెప్పారు. కాశీనాథ్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీకి చెందిన క్రీడాకారులు మూడు బంగారు, ఐదు రజత, 17 కాంస్యలతో సహా మొత్తం 25 పతకాలు సాధించారన్నారు. పతకాలు సాధించిన క్రీడాకారులను న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ అధ్యక్షులు అచ్చం నాయుడు, ప్రధాన కార్యదర్శి సీహెచ్ వేణుగోపాలరావు, కోచ్‌లు బి. విజయ్, బి.వెంకట సాయి సుబ్రహ్మణ్యం లను అసోసియేషన్ నాయకులు అభినందించి జ్ఞాపికలు, ప్రశంసా పత్రాలు అందించారు.
గుంటూరు ఎడ్యుకేషన్: పేద, మధ్య తరగతి వర్గాలకు అండగా ఉంటూ సమాజంలో విద్యాభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్న బడ్జెట్ పాఠశాలలు మనుగడ సాగించే విధంగా ప్రభుత్వం చేయూత అందించాలని ఏపీ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్(అప్సా) రాష్ట్ర కో చైర్మన్ మేకల్ రవీంద్రబాబు, రాష్ట్ర కోశాధికారి చెరుకూరి శ్రీహరి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వంగా శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. మంగళవారం అప్సా ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న అప్సా భాగస్వామ్య ప్రైవేటు పాఠశాలలను బైక్ ర్యాలీగా వెళ్లి సందర్శించారు. ఈసందర్భంగా ఆయా పాఠశాలలు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈసందర్భంగా అప్సా రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ బడ్జెట్ స్కూల్స్ రక్షణ కోసం సంఘటితం కావాలని, ప్రభుత్వాల నుంచి ఎటువంటి సహాయం పొందకుండా, స్వయంకృషితో డిగ్రీలు చేత పట్టుకుని ఎన్నో ఏళ్లుగా చిన్న పాఠశాలలను ఏర్పాటు చేసుకుని, అర్హత గల ఉపాధ్యాయులతో పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని తెలిపారు. కార్పొరేట్‌కు దూరంగా తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తూ పేద, బడుగు, బలహీనవర్గాలకు అండగా నిలుస్తున్న సంఘ జిల్లా నాయకులు రాజేష్ నాయుడు, భాను ప్రసాద్, వెంకటేశ్వర రెడ్డి పాల్గొన్నారు.
గుంటూరు ఎడ్యుకేషన్: గుంటూరు రూరల్ మండలం లక్ష్మీనరసింహాపురంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ప్రైమరీ స్కూల్ హెచ్‌ఎం టి.నిర్మలను జిల్లా విద్యాశాఖాధికారి షేక్ సలీమ్ బాషా సస్పెండ్ చేశారు. గత నెలలో ఇదే పాఠశాలలో పనిచేస్తున్న ఎస్జీటీ ఎస్.రమాదేవి తనపై హెచ్‌ఎం నిర్మల చేయిచేసుకున్నారని డీఈఓకు ఫిర్యాదు చేశారు. జరిగిన ఘటనపై ఉప విద్యాశాఖాధికారితో విచారణ జరిపించిన డీఈఓ సలీమ్ బాషా విచారణ నివేదిక ఆధారంగా సంబంధిత హెచ్‌ఎం టి.నిర్మలను సస్పెండ్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు విడుదల చేశారు.


