కార్పొరేట్లకు వేల ఎకరాలు ధారాదత్తం దళితుల శ్మశాన స్థలాల సమస్యలను పరిష్కరించాలి కలెక్టరేట్ ఎదుట సామాజిక శంఖారావం ధర్నాలో నాయకులు డిమాండ్
లక్ష్మీపురం: దళితులు, గిరిజనులు నివసించటానికి ఇంటి స్థలాలు, చనిపోతే శ్మశాన స్థలాలు కూడా ఇవ్వలేని ప్రభుత్వం పరిశ్రమల పేరుతో పెట్టుబడిదారులకు 99 పైసలకే వేల ఎకరాలు ధారాదత్తం చేస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం మాజీ రాష్ట్ర కార్యదర్శి పి.మురళీకృష్ణ విమర్శించారు. కులవివక్ష వ్యతిరేక పోరాటం, వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా దళిత, గిరిజన కాలనీల్లో నిర్వహించిన సర్వేలో వెలుగుచూసిన సమస్యల పరిష్కారానికి సోమవారం గుంటూరు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యక్రమానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు అధ్యక్షత వహించారు. మురళీకృష్ణ మాట్లాడుతూ జస్టిస్ పున్నయ్య కమిషన్, కోనేరు రంగారావు సిఫార్సులు అమలు కావట్లేదన్నారు. రంగారావు కమిటీ సిఫార్సులు అమలు చేస్తే రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి రెండెకరాల భూమి ఇవ్వవచ్చన్నారు. పేదలకు కొత్తగా స్థలాలు ఇవ్వకపోగా గతంలో ఇచ్చిన భూములును కూడా లాక్కుంటుందని మండిపడ్డారు. దళితులపై నేటికీ కులవివక్ష, దాడులు కొనసాతున్నాయన్నారు. ఇటీవల ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగిన యువత చేపట్టిన ఆందోళన ఫలితంగా మోదీ ప్రభుత్వం దిగి వచ్చిందని, వారి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని పేదలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. కౌలు రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పాశం రామారావు మాట్లాడుతూ జిల్లాలో నెలరోజులకుపైగా 14 మండలాల్లోని 50 గ్రామాలు, మూడు పట్టణాల్లోని 15 కాలనీల్లో అధ్యయనం చేయటం జరిగిందన్నారు. మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో నారా లోకేష్ ఇళ్ల పట్టాలు ఇస్తానని హామీ ఇచ్చాడని, కానీ 22 వేల మందికి ఇవ్వాల్సి ఉండగా మూడు వేల మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నారని పేర్కొన్నారు. తక్షణమే అర్హులందరికీ ఇళ్ల స్థలాలు, పట్టాలు ఇవ్వాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి ఈమని అప్పారావు, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జె.నవీన్‌ప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షులు బూరుగ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మంగళగిరి– తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుండిమెడ, నూతక్కిలో లంకభూములు సాగు చేసుకుంటున్న వారికి పాస్ పుస్తకాలు ఇవ్వాలన్నారు. దుగ్గిరాల మండలం రేవేంద్రపాడు దళితులకు రామచంద్రపాలెం లంకలో ఉన్న భూములు ఇప్పుడు వారి పేరుతో లేవని, వాటిని సర్వే చేసి వారికి ఇప్పించాలని కోరారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేసి గ్రామీణ పేదలకు ఉపాధి అవకాశాలు పెంచాలన్నారు.
జిల్లాలో సగటు వర్షపాతం 7.8 మి.మీటర్లు
కొరిటెపాడు(గుంటూరు): గుంటూరు జిల్లాలో ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు 13 మండలాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. అత్యధికంగా చేబ్రోలు మండలంలో 26.4 మిల్లీ మీటర్లు వర్షం కురవగా, అత్యల్పంగా ఫిరంగిపురం మండలంలో 1.8 మి.మీ వర్షం కురిసింది. సగటున 7.8 మి.మీ వర్షపాతం నమోదైంది. వివిధ మండలాల్లో నమోదైన వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి.. పెదకాకాని మండలంలో 20.4 మి.మీ., దుగ్గిరాల 18.4, తెనాలి 17.6, పెదనందిపాడు 10.2, కొల్లిపర 8.8, కాకుమాను 8.6, వట్టిచెరుకూరు 7.2, పొన్నూరు 6.4, గుంటూరు తూర్పు 6.4, గుంటూరు పశ్చిమ 5.4, ప్రత్తిపాడు మండలంలో 2.8 మి.మీ చొప్పున వర్షం పడింది. ఆగస్టు నెల 24వ తేదీ వరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 127.5 మి.మీ పడాల్సి ఉండగా, ఇప్పటి వరకు 79.1 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది.


