కలెక్టరేట్ ఎదుట విద్యార్థినులు, తల్లిదండ్రుల ధర్నా
నగరంపాలెం: ప్రైవేట్ నర్సింగ్ కళాశాల కరస్పాండెంట్‌ను వెంటనే కళాశాల నుంచి తొలగించాలని ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర సమన్వయకర్త కరీం డిమాండ్ చేశారు. గుంటూరు పాతగుంటూరులోని ఓ ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలో విద్యనభ్యసించే విద్యార్థినులు, వారి తల్లిదండ్రులతో సోమవారం రాత్రి కలెక్టరేట్ ఎదుట ధర్నా చౌక్ వద్ద నిరసన చేపట్టారు. విద్యార్థినులు ప్లకార్డులతో నినదించారు. కరీం మీడియాతో మాట్లాడుతూ నర్సింగ్ విద్యార్థినులపై అసభ్యంగా మాట్లాడుతున్న కరస్పాండెంట్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో అతనిపై గుంటూరు తూర్పు పోలీస్ సబ్ డివిజన్‌లోని ఓ పోలీస్‌స్టేషన్‌లో మూడు కేసులు నమోదైనట్లు తెలిపారు. ఇదే కళాశాలకు సంబంధించి తెనాలిలో విధులు నిర్వర్తించే సమయంలోనూ అతనిపై ఆరోపణలు రావడంతో తొలగించారని గుర్తుచేశారు. సదరు కరస్పాండెంట్‌ను తొలగించే వరకు న్యాయం పోరాటం చేస్తామని చెప్పారు. జిల్లా కలెక్టర్ సాయికాంత్‌వర్మను ఎన్‌ఎస్‌యూఐ నాయకులు కరీం, మదన్, షాయల్, తంబీర్, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు మహేష్‌బాబు, విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు కలిశారు. ఆ కళాశాలలో చదవలేమని, సదరు కరస్పాండెంట్‌ను సత్వరమే విధులు నుంచి తొలగించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.


