జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ
గుంటూరు వెస్ట్: జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో నిర్వహించనున్నందున, నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ఓటర్ వెరిఫికేషన్ పూర్తి చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ సీఎం సాయికాంత్ వర్మ ఆదేశించారు. సోమవారం ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో స్థానిక కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం, ఎన్నికల సంఘం నుంచి అందే మార్గదర్శకాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేయాలని సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన మౌలిక సదుపాయాలు, పోలింగ్ కేంద్రాల పరిస్థితి, సిబ్బంది సమన్వయం తదితర అంశాలపై ముందస్తుగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. భూ సంబంధిత సమస్యలు, ధ్రువీకరణ పత్రాలు, ఇతర రెవెన్యూ సేవలకు సంబంధించి ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకొని పరిష్కరించాలని తెలిపారు. జిల్లాలో ఆధార్ కార్డులు లేని యానాది కుటుంబాలను క్షేత్రస్థాయిలో గుర్తించి, వారికి ఆధార్ కార్డులు అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. సంబంధిత గ్రామాలు, నివాస ప్రాంతాలను అధికారులు సందర్శించి అర్హులైన వారిని గుర్తించాలని, అవసరమైన పత్రాలు, వివరాలను సేకరించి ఆధార్ నమోదు ప్రక్రియను సులభతరం చేయాలని సూచించారు. గ్రీన్ గుంటూరు కార్యక్రమం కింద చేపడుతున్న పచ్చదనం, మొక్కల పెంపకం, వాటి సంరక్షణ కార్యక్రమాల పురోగతిని సమీక్షించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా బాధ్యతలు కేటాయించాలని, మొక్కల జీవన శాతం పెంచేందుకు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. పంటల బీమా పథకం అమలుకు అర్హులైన రైతులందరూ పంటల బీమా ప్రయోజనం పొందేలా వ్యవసాయ శాఖ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది అవగాహన కల్పించాలని సూచించారు. పంటల బీమా ప్రాముఖ్యతను రైతులకు వివరించి, అర్హత కలిగిన రైతులు తప్పనిసరిగా బీమా పరిధిలోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే జిల్లాలో అమలవుతున్న వీబీ జీ రామ్‌జీ కింద చేపడుతున్న పనులను నిర్దేశిత లక్ష్యాల మేరకు వేగవంతంగా పూర్తి చేయాలని, క్షేత్రస్థాయిలో పనుల నాణ్యతను అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీ వాస్తవ, డీఆర్‌ఓ ఖాజావలి, ఆర్డీవో శ్రీనివాసరావు, డీఆర్‌డీఏ పీడీ విజయలక్ష్మి, ఇతర శాఖల అధికారులు పాల్గొన్నారు.


