జూనియర్‌ వైద్యుల సమ్మె ఉధృతం | - | Sakshi
Sakshi News home page

జూనియర్‌ వైద్యుల సమ్మె ఉధృతం

Aug 18 2026 7:16 AM | Updated on Aug 18 2026 7:16 AM

జూనియర్‌ వైద్యుల సమ్మె ఉధృతం జీజీహెచ్‌లో అన్ని వైద్యసేవలు బంద్‌

ఎనిమిదో రోజుకు చేరిన రిలే నిరాహార దీక్షలు జూడాలకు ఐఎంఏ నేతల మద్దతు

రోగులకు

తీవ్ర

ఇబ్బందులు

జీజీహెచ్‌లో అన్ని వైద్యసేవలు బంద్‌

గుంటూరు మెడికల్‌: ఆంధ్రప్రదేశ్‌ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు గుంటూరు జీజీహెచ్‌లో జూనియర్‌ డాక్టర్స్‌( జూడా) చేస్తున్న సమ్మె సోమవారానికి ఎనిమిదోరోజుకు చేరుకుంది. ఏడు రోజులపాటు అత్యవసర వైద్యసేవలన్నీ అందించి కేవలం ఓపీలు, ఐపీ వైద్య సేవలు మాత్రమే అదికూడా ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే నిలిపివేసి జూడాలు తమ నిరసన తెలియజేశారు. సోమవారం నుంచి ఓపీ వైద్యసేవలు, ఐపీ వైద్యసేవలు, ఎవర్జెన్సీ వైద్యసేవలు, ఐసీయూ, లేబర్‌రూమ్‌, ఆపరేషన్‌ థియేటర్స్‌ ఇలా ప్రతి వైద్యసేవలనూ నిలిపివేసి పూర్తిస్థాయి బంద్‌లో జూడాలు పాల్గొన్నారు. సోమవారం 15 మంది జూడాలు రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. రాత్రి 9 గంటల వరకు రిలే నిరాహార దీక్షలు కొనసాగించారు. యూనియన్‌ నాయకులు మాట్లాడుతూ వారం రోజులుగా తాము సమ్మె చేస్తున్నా తమ సమస్యను పరిష్కరించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందన్నారు.స్టయి పెండ్‌ పెంపుదల కోసం జనవరి నుంచి తాము ప్రభుత్వానికి వినతిపత్రాలు సమర్పించినా ఎలాంటి స్పందన లేకపోవటంతో గత్యంతరం లేక సమ్మె చేస్తున్నామన్నారు. రోగులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం సత్వరమే తమ న్యాయమైన డిమాండ్‌ను నెరవేర్చాలని కోరారు. లేని పక్షంలో మంగళవారం నుంచి మరింత తీవ్రస్థాయిలో నిరసన కార్యక్రమాలు ఉంటాయని హెచ్చరించారు. గుంటూరు జీజీహెచ్‌, వైద్య కళాశాలకు చెందిన పీజీలు, హౌస్‌సర్జన్లు అధిక సంఖ్యలో హాజరై మద్దతు తెలియజేశారు. సమ్మెలో గుంటూరు మెడికల్‌ కాలేజ్‌ జూనియర్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు యు.ఈశ్వర్‌శంకర్‌, వైస్‌ ప్రెసిడెంట్స్‌ ఎ.వి.కష్ణచౌదరి, కె.ప్రసన్న ఆదిలక్ష్మి, షేక్‌ సోహిల్‌ ఆలి తదితరులు పాల్గొన్నారు.

సమస్యలను సత్వరం పరిష్కరించాలి

ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్‌ వైద్యులు గత వారం రోజులుగా సమ్మెలో ఉన్నారని, ఫలితంగా ప్రభుత్వ బోధనాసుపత్రుల్లో వైద్య సేవలకు తీవ్ర అంతరాయం కలుగుతోందని ప్రభుత్వం వెంటనే స్పందించి జూనియర్‌ వైద్యుల న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ సెంట్రల్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు, సంయుక్త రాష్ట్ర పూర్వ ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్‌ నాగళ్ళ కిషోర్‌ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సోమవారం ఉదయం స్థానిక గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రిలో సమ్మె చేస్తున్న జూనియర్‌ వైద్యుల రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి ఐఎంఏ తరఫున పూర్తి సంఘీభావం ప్రకటించారు. ఐఎంఏ గుంటూరు శాఖ అధ్యక్షుడు డాక్టర్‌ టి.సేవ కుమార్‌, కార్యదర్శి డాక్టర్‌ బి.సాయి కృష్ణ, రాష్ట్ర వర్గం కమిటీ సభ్యులు రాజేంద్ర, గుంటూరు శాఖ సంయుక్త కార్యదర్శి డాక్టర్‌ సిహెచ్‌. శ్రీనివాస్‌ రెడ్డిలు మాట్లాడారు. అనంతరం ఐఎంఏ ప్రతినిధులు ఆసుపత్రి సూపరిండెండెంట్‌ డాక్టర్‌ జి.దుర్గాప్రసాద్‌ ను కలసి జూనియర్‌ వైద్య సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని కోరారు.

అన్ని రకాల వైద్యసేవలను జూనియర్‌ డాక్టర్లు నిలిపివేయటంతో పలు జిల్లాల నుంచి జీజీహెచ్‌కు వచ్చిన పేద రోగులు వైద్యసేవల్లో తీవ్ర జాప్యం వాటిల్లి ఇబ్బంది పడ్డారు. గుంటూరు మెడికల్‌ కాలేజ్‌, పలు ఆరోగ్య కేంద్రాల నుంచి వైద్యులను డెప్యూటేషన్‌పై ఆస్పత్రి అధికారులు తీసుకొచ్చినా వారికి స్పెషాలిటీ, సూపర్‌ స్పెషాలిటీ వంటి వైద్యసేవల్లో అనుభవం లేకపోవటంతో రోగులకు ఇబ్బందులు తప్పటం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement