హాస్టల్ వదిలి వెళ్లిపోయిన వార్డెన్ విద్యార్థులు ప్రశ్నిస్తే బాధ్యతారాహిత్యంగా సమాధానం ఆకలితో అల్లాడిపోయిన విద్యార్థులు ఎస్‌వీఎన్ కాలనీ ఎస్సీ హాస్టల్‌లో ఈనెల 17న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం
ఆకలి కేకలు
నెహ్రూనగర్: ప్రభుత్వ సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల సంక్షేమం గాల్లో దీపంగా మారింది. అధికారులు, వార్డెన్ల నిర్లక్ష్యానికి సజీవ సాక్ష్యంగా శుక్రవారం రాత్రి గుంటూరు నగరంలోని ఎస్‌వీఎన్ కాలనీలో ఉన్న ఎస్సీ హాస్టల్‌లో హృదయవిదారక ఉదంతం చోటుచేసుకుంది. మెనూ ప్రకారం భోజనం పెట్టకపోగా, ఉన్న కాస్త అన్నం, కూర కూడా అయిపోవడంతో సుమారు 20 మందికి పైగా విద్యార్థులు ఆకలితో అలమటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనిపై విద్యార్థులు వీడియో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చి చర్చనీయాంశంగా మారింది.
కూర లేదు.. అన్నం లేదు.. నీళ్ల చారే దిక్కు!
మెను ప్రకారం రోజువారీ ఆహారం పెట్టకుండా నిబంధనలను పక్కనబెట్టి నాణ్యత లేని టమాటా కూర, నీళ్లలాంటి చారును వండారని విద్యార్థులు వాపోయారు. తీరా రాత్రి 8 గంటల సమయానికే కూర, అన్నం పూర్తిగా అయిపోయాయి. అప్పటికే ఆకలితో ఉన్న సుమారు 20 మంది విద్యార్థులు తినడానికి తిండి లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వండిన కూర నీళ్ల సాంబారులా ఉందని, అన్నంలో నీళ్లు కలుపుకొని తినాల్సిన దుస్థితి వచ్చిందని విద్యార్థులు వాపోయారు.
వార్డెన్ బాధ్యతారాహిత్యం
హాస్టల్‌లో విద్యార్థులకు భోజన వసతి సరిగ్గా అందుతుందో లేదో చూడాల్సిన వార్డెన్ రాత్రి 7:45 గంటలకే హాస్టల్ వదిలి వెళ్లిపోయారని విద్యార్థులు ఆరోపించారు. హాస్టల్‌లో అన్నం, కూర అయిపోయి విద్యార్థులు ఆకలితో అలమటిస్తుంటే.. విద్యార్థులు వార్డెన్‌కు దాదాపు 10 సార్లు ఫోన్ చేసినప్పటికి స్పందించలేదని ఆరోపించారు. చివరకు అరగంట తర్వాత ఫోన్ ఎత్తిన వార్డెన్.. తాను కూరగాయలు తెచ్చి హాస్టల్‌లో పెట్టి హాస్పిటల్‌కి వచ్చానని సాకులు చెప్పడంపై విద్యార్థులు మండిపడుతున్నారు. రాత్రి 9 గంటలైనా భోజనం లేదని, తాము ఏం తినాలని విద్యార్థులు నిలదీయగా.. ‘రేపు పొద్దున వండిస్తానయ్యా‘ అంటూ వార్డెన్ అత్యంత బాధ్యతారాహిత్యంగా సమాధానమిచ్చారు. విద్యార్థులు తమ బాధను వివరిస్తుండగానే వార్డెన్ ఫోన్ కట్ చేయడం వారి పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని స్పష్టం చేస్తోంది.
తెల్లారితే పరీక్షలు.. రాత్రంతా పస్తు పడుకోవాల్సిన దౌర్భాగ్యం
ఉదయం తమకు పరీక్షలు ఉన్నాయని, రాత్రంతా ఆకలితో ఉంటే పరీక్షలు ఎలా రాయాలని విద్యార్థులు వీడియోలో వాపోయారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, విద్యార్థుల ఆకలి తీర్చడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని, హాస్టల్‌లో మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందేలా చూడాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఆదివారం వెలుగులోకి వచ్చిన వీడియోపై జిల్లా ఎస్సీ వెల్ఫేర్ అధికారి హర్షితను వివరణ కోరగా ఆమె స్పందించలేదు.


