పశ్చిమలో ‘పచ్చ’ఓట్ల దగా? | - | Sakshi
Sakshi News home page

పశ్చిమలో ‘పచ్చ’ఓట్ల దగా?

Jul 15 2026 2:04 AM | Updated on Jul 15 2026 2:04 AM

పశ్చిమలో ‘పచ్చ’ఓట్ల దగా?

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో దొంగ ఓట్లు ఒక్కో అపార్ట్‌మెంట్‌లో వందల సంఖ్యలో వెలుగులోకి.. మొత్తం నియోజకవర్గంలో 83,293 ఓట్లు లేని వైనం గత ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు ఇవే కారణమా?

అందుకే టీడీపీ విజయం సాధించిందా?

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో సర్‌ ప్రక్రియ పుణ్యమా అంటూ దొంగ ఓట్ల బాగోతం బయటపడుతోంది. నియోజకవర్గంలో ఎక్కువ అపార్ట్‌మెంట్లు ఉన్న ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని అక్కడ దొంగ ఓట్లు చేర్చినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం సర్‌ ప్రక్రియలో భాగంగా పూర్తి స్థాయిలో ఓట్ల పరిశీలన జరుగుతుండటంతో పశ్చిమ నియోజకవర్గంలో అంతులేని అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

భారీగా మిస్సింగ్‌...

గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మొత్తం 2,78,555 ఓట్లు ఉన్నాయి. వీటిని బీఎల్‌ఓలు, బీఎల్‌ఓ సూపర్‌వైజర్లు క్షుణ్ణంగా పరిశీలించారు. ఇందులో మ్యాపింగ్‌ కాని ఓట్లు 19,873, డెత్‌లు 11,728, పర్మినెంట్‌ అడ్రస్‌ షిఫ్టింగ్‌ 38,977, డబుల్‌ ఓటింగ్‌ 6,218, అబ్సెంట్‌ ఓట్లు 6,384, అదర్స్‌ 113... ఇలా అన్నీ కలిపి మొత్తం 83,293 ఓట్లు ఉన్నాయి. డెత్‌లు 11,728, అబ్సెంట్‌ ఓట్లు 6,384 పోయినప్పటికీ, దాదాపు 60 వేలకుపైగా దొంగ ఓట్లు ఉన్నాయని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.

అపార్ట్‌మెంట్‌లలోనే..

పశ్చిమ నియోజకవర్గంలోని చంద్రమౌళినగర్‌, విద్యానగర్‌, వికాస్‌నగర్‌, కృష్ణానగర్‌, నవభారత్‌నగర్‌, రాజేంద్రనగర్‌, శ్యామలనగర్‌, ఎస్‌వీఎన్‌ కాలనీ తదితర ప్రాంతాల్లోని అపార్ట్‌మెంట్లలో ఓట్లు ఉంటాయి. కానీ అందులో ఓటర్లు ఉండరనే విషయాన్ని బీఎల్‌ఓలు, బీఎల్‌ఓ సూపర్‌వైజర్లు గమనించారు. ఒక్కో అపార్ట్‌మెంట్‌లో వందకుపైగా దొంగ ఓట్లు గుర్తించినట్లు సమాచారం. దీంతోపాటు మరణించిన వారి పేర్లపై కూడా 2024 ఎన్నికల్లో ఓట్లు పడ్డాయనే అనుమానాలు లేకపోలేదు.

డబుల్‌ ఎంట్రీ ఓట్లపై దృష్టి ముఖ్యం

నియోజకవర్గంలో డబుల్‌ ఎంట్రీ ఓట్లు 6,218 ఉన్నాయి. వీరంతా కూడా ఎక్కడో ఒక చోట ఓటు వేసి, తిరిగి పశ్చిమలో ఓటు వేశారని చెప్పుకోవచ్చు. ఒకే ఇంటి పేరుతో ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి ఇక్కడ దొంగ ఓట్లు సృష్టించారనే ఆరోపణలు లేకపోలేదు. అదే విధంగా పేరులోని ఒకటి, రెండు అక్షరాలను మార్చి లేదా తొలగించి వారి పేర్లపై దొంగ ఓట్లు సృష్టించారనే ఆరోపణలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఈ డబుల్‌ ఎంట్రీ ఓటింగ్‌పై విచారణ చేపడితే అసలు నిజాలు బయటకు వస్తాయని వైఎస్సార్‌సీపీ శ్రేణులు పట్టుబడుతున్నాయి. వీరందరిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేయాలని నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

2024 అసెంబ్లీ, పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనవరిలో విచ్చలవిడిగా దొంగ ఓట్లు పశ్చిమ నియోజకవర్గంలో చేర్చినట్లు ప్రస్తుత సర్‌ ప్రక్రియ లెక్కలు చూస్తుంటే అర్థమవుతోంది. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి, ప్రస్తుత ఎమ్మెల్యే గళ్ళా మాధవికి 1,16,067 ఓట్లు వచ్చాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి విడదల రజనికి 64,917 ఓట్లు దక్కాయి. వీటి మధ్య వ్యత్యాసం 51,150 ఓట్లు. కాగా, ప్రస్తుతం సర్‌ ప్రక్రియలో భాగంగా సదరు ఓట్ల లెక్కలను క్షుణ్ణంగా పరిశీలిస్తే, 60 వేలకుపైగా ఉన్న దొంగ ఓట్లే గల్లా మాధవి గెలవడానికి ప్రధాన కారణమని ఆరోపణలు వస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement