ఫిరంగిపురం: మండల కేంద్రంలోని కార్మెల్ కొండపైనున్న కార్మెల్ మాత ఉత్సవాలు మంగళవారం ప్రారంభమయ్యాయి. బాల ఏసు దేవాలయంలో విచారణ గురువు ఫాతిమా మర్రెడ్డి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను ప్రారంభించారు. కొండపై దివ్యపూజాబలి నిర్వహించారు. కొండవీడు విచారణ గురువు సీహెచ్ అలెక్స్ వాక్యోపదేశం చేశారు. దివ్యపూజాబలి కార్యక్రమంలో మొదటిరోజు సెయింట్ ఆన్స్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, మఠకన్యలు పాల్గొన్నారు. అనంతరం మరియమాతను ప్రత్యేకంగా అలంకరించారు. తేరులో ఉంచి ఆలయ ప్రదక్షిణ చేయించారు.
గుంటూరు మెడికల్: పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పోస్టుల భర్తీకి ఈ నెల 7 నుండి 13వ తేదీ వరకు కౌన్సెలింగ్ నిర్వహించినట్లు డీఎంహెచ్‌ఓ డాక్టర్ కొర్రా విజయలక్ష్మి తెలిపారు. పట్టణ ఆరోగ్యకేంద్రాలలో 20 ఫార్మసిస్ట్, ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలలో 20 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు భర్తీ చేశామన్నారు. ఎంపికై న వారికి మంగళవారం నియామకపు ఉత్తర్వులు గుంటూరు డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో డాక్టర్ విజయలక్ష్మి అందజేశారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించి ఆసుపత్రికి మంచి పేరు తీసుకురావాలని ఆమె సూచించారు.
మంగళగిరి టౌన్: మంగళగిరి పట్టణంలోని పానకాల లక్ష్మీనరసింహ స్వామి కొండపై ఉన్న గండాలయ స్వామికి మంగళవారం భక్తులు విశేష పూజలు నిర్వహించారు. అమావాస్యను పురస్కరించుకుని తెల్లవారుజాము నుంచే భారీ సంఖ్యలో భక్తులు కొండపైకి చేరుకున్నారు. గండాలయ స్వామివారిని దర్శించుకున్నారు. తమ గండాలన్నీ తొలగిపోవాలని కోరుకుంటూ పూజలు చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ నిర్వాహకులు, ఎండోమెంట్ అధికారులు తగిన సౌకర్యాలు కల్పించారు.
పెదకాకాని: శివాలయంలో అమావాస్య మంగళవారాన్ని పురస్కరించుకుని రాహుకేతు పూజలు చేసేందుకు అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పెదకాకాని శ్రీ భ్రమరాంబ మల్లేశ్వరస్వామి దేవస్థానంలో తెల్లవారు జాము నుంచే భక్తుల సందడి నెలకొంది. మధ్యాహ్నం రాహుకాలం 3 గంటల వరకు భక్తులు పాలుపంచుకున్నట్లు ఆలయ ఉప కమిషనర్ గోగినేని లీలాకుమార్, చైర్మన్ కోసూరి పూర్ణచంద్రరావులు తెలిపారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేశామన్నారు. పూజా టికెట్‌ల విక్రయం ద్వారా స్వామి వారికి రు. 5.30 లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిపారు.
దుర్గమ్మకు బంగారు హారం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మకు గుంటూరుకు చెందిన భక్తుడు మంగళవారం రూ. 3 లక్షల విలువైన బంగారుహారాన్ని సమర్పించారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం హరిచంద్రపురానికి చెందిన సీహెచ్ వంశీకృష్ణ అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. ఆలయ అధికారులను కలిసి సుమారు 20 గ్రాముల బంగారంతో తయారు చేయించిన హారాన్ని అందజేశారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అధికారులు అమ్మవారి దర్శనం కల్పించారు.


