చిరిగిన బ్యాగులు.. ప్లాస్టిక్ కవర్లు, విద్యామిత్ర కవర్లలో పుస్తకాలు, స్వీటు బ్యాగు సంచుల్లో పలకలు, జూటు బ్యాగుల్లో నోట్‌బుక్స్.. ఇలా కనిపిస్తున్న ఈ చిత్రాలు చంద్రబాబు సర్కారు తీరును వెక్కిరిస్తున్నాయి. విద్యార్థులు పుస్తకాలు ఇలా బడికి వెళ్తుండటం విద్యాశాఖ నిర్వాకాన్ని ఎండగడుతోంది. పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికే డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్లు పంపిణీ చేస్తామంటూ ఊదరగొట్టిన చంద్రబాబు ప్రభుత్వం,... బడులు తెరిచి నెల అవుతున్నా నేటికీ స్కూల్ బ్యాగ్‌లు ఇవ్వలేదు. విద్యార్థులు ఇలా చిరిగిన బ్యాగులు, కవర్లలో పుస్తకాలను తీసుకుని బడి నుంచి ఇంటికి వెళుతుండటం మంగళవారం సాయంత్రం నియోజకవర్గ కేంద్రం ప్రత్తిపాడులో ‘సాక్షి’ కెమెరాకు కనిపించింది. ప్రత్తిపాడు మండలంలో 2,517 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారు. ఏ ఒక్కరికీ ఇప్పటి వరకు ఈ ఏడాది నూతన బ్యాగులు ఇవ్వలేదని మండల విద్యాశాఖ అధికారులు తెలిపారు. – ప్రత్తిపాడు


