మతోన్మాద విధానాలను ఐక్యంగా తిప్పికొట్టాలి
లక్ష్మీపురం: కేంద్రంలో బీజేపీ నాయకత్వంతో అధికారంలో వున్న ఎన్‌డీఏ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక మతోన్మాద విధానాలకు నిరసనగా ప్రజలంతా ఐక్యంగా తిప్పికొట్టాలని, ఈ విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె.ప్రభాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. పాతగుంటూరులోని ఆదివారం సీఐటీయూ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాశం రామారావు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక మతోన్మాద చర్యలను రెచ్చగొడుతుందన్నారు. కార్మిక వర్గం దీర్ఘకాలంగా పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను మార్చి నాలుగు లేబర్ కోడ్‌లుగా కుదించి కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం కృషి చేస్తుందన్నారు. ఓటర్ల ప్రత్యేక సవరణ పేరుతో బీజేపీకి వ్యతిరేకంగా వున్న ఓట్లను తొలిగిస్తుందన్నారు. ఇది అప్రజాస్వామిక చర్యలన్నారు. జాతీయోద్యమంలో కీలకపాత్ర పోషించిన గాంధీ, నెహ్రూ, సుభాష్‌చంద్ర బోస్ వంటి వారి చరిత్రలను మరుగున పర్చే ప్రయత్నం చేస్తుందన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వై.నేతాజీ మాట్లాడుతూ గుంటూరు ఛానల్ పర్చూరు వరకు పొడిగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని, నల్లమడ ఆధునికీకరణ కోసం నిధులు కేటాయించాలని కోరారు. జిల్లాలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు, వివిధ రకాల పెన్షన్లు మంజూరు చేయాలని కోరారు. ఈ నెల 29 నుంచి ఫిబ్రవరి 1 వరకు గుంటూరులో జరిగే అఖిల భారత కిసాన్ సభ జాతీయ విస్తృత సమావేశాలను జయప్రదం చేయాలని, దీనికోసం విస్తృతంగా ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఈమని అప్పారావు, ఎం.రవి, బూరుగు వెంకటేశ్వర్లు, ఎన్.భావన్నారాయణ, కె.నళీనికాంత్, జిల్లా కమిటీ సభ్యులు ఎల్.అరుణ, కె.అజయ్‌కుమార్, దుర్గారావు, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 12న జరిగే జాతీయ సమ్మెను
జయప్రదం చేయండి


