అమరేశ్వరునికి భోగి సేవ
అమరావతి: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అమరావతిలో వేంచేసియున్న శ్రీ బాలచాముండికా సమేత అమరేశ్వరుని సంక్రాంతి ఉత్సవాలలో భాగంగా బుధవారం భోగి పండుగ సందర్భంగా గ్రామోత్సవం నిర్వహించారు. భక్తులు స్వామి వారికి వారు పోసి హారతులు ఇచ్చి పూజలు చేశారు. అలాగే అమరావతి పాండురంగస్వామి దేవాలయంలో గోదాదేవి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు.
నకరికల్లు: భోగి పండుగ సందర్భంగా స్థానిక ఆదిలక్ష్మీ చెంచులక్ష్మీ సమేత శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి రథోత్సవం బుధవారం కనుల పండువగా నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో స్థానిక శ్రీ కన్యకాపరమేశ్వరి ఆలయం నుంచి ప్రారంభమైన రథోత్సవం పురవీధుల్లో సాగింది. యువకులు, భక్తులు రథాన్ని లాగుతూ స్వామివారి నామస్మరణ చేస్తూ ముందుకు సాగారు. ముందుగా అర్చకులు కొడవటికంటి మధుసూదనాచార్యులు, పాండురంగాచార్యులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.
రేపల్లె: పట్టణంలోని ఉప్పూడి రహదారిలోని రాజ్యలక్ష్మి, గోదా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం గోదాదేవి కల్యాణం వైభవంగా నిర్వహించారు. అమ్మవారిని, రంఘనాథస్వామి వారిని వధూవరులుగా తీర్చిదిద్ద వేదమంత్రాల నడుమ కళ్యాణం కనుల పండువగా జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. తీర్థప్రసాదాలు స్వీకరించారు.
గుంటూరు రూరల్: నల్లపాడు, చల్లావారిపాలెం గ్రామాల ఇలవేల్పు దేవత శ్రీ పుట్టలమ్మతల్లి శ్రీ ఘంటాలమ్మ తల్లి సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. గత ఏడాది అమ్మవారి వద్ద ప్రత్యేక పూజలందుకున్న 9 కిలోల లడ్డూను వేలంలో రూ.15 లక్షలకు పాడుకున్న భక్తుడు దుగ్గెంపూడి సుధాకర్‌రెడ్డి, శ్రీవాణి దంపతులు ఆలయానికి అందించిన నగదుతో ఆలయ కమిటీ చైర్మన్ ఇంటూరి అంజిరెడ్డి, కమిటీ సభ్యులు అమ్మవారికి కెంపు, పగడాలు పొదిగిన హారాన్ని తయారు చేయించారు. సుధాకర్‌రెడ్డి దంపతులు ఆలయ కమిటీ సమక్షంలో బుధవారం అమ్మవారికి బహూకరించారు. కార్యక్రమంలో దుగ్గెంపూడి యోగేశ్వర్‌రెడ్డి, గౌతమ్ కార్తికేయరెడ్డి, తరుణ్ కార్తికేయరెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
మాచర్ల : సంక్రాంతి పండుగను పురస్కరించుకొని వీరనారి చాకలి ఐలమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో బుధవారం ఆమె విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథులుగా విచ్చేసిన ప్రముఖ దంతవైద్యులు సిద్దూ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా పలువురు పేద మహిళలకు చీరెలు పంపిణీ చేయటం ప్రశంసనీయమన్నారు. అనంతరం 100 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాదులు కేళం శ్రీనివాసరావు, ఆవుల ఉదయ్‌కుమార్, అబ్దుల్ కలాం సేవా సమితి అధ్యక్షులు పాషావలి, వ్యవస్థాపక అధ్యక్షులు మన్నెం పాండురంగారావు, మోరా భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
అమరేశ్వరునికి భోగి సేవ
అమరేశ్వరునికి భోగి సేవ
అమరేశ్వరునికి భోగి సేవ
అమరేశ్వరునికి భోగి సేవ


