జిల్లాల విభజనలో సాంకేతికత లేదు
బాపట్ల: రాష్ట్రంలో జిల్లాల పునర్విభజనలో సాంకేతికత లేదని మాజీ డెప్యూటీ స్పీకర్ కోన రఘుపతి పేర్కొన్నారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో కోన రఘుపతి మాట్లాడారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని విభన చేపడితే కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసమే పునర్విభజన చేసిందన్నారు. పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేయటం వలన నీతిఆయోగ్ నుంచి నిధుల విడుదల, వాటి సఫలీకృతం చేసేందుకు వీలు ఉంటుందనే మంచి ఆలోచనతో విభజన చేశారని గుర్తు చేశారు. మా మార్క్ కనిపించాలనే విధంగా కూటమి ప్రభుత్వం అశాసీ్త్రయంగా విభజన చేసిందన్నారు. రాయచోటి జిల్లాను మార్పుచేసి మదనపల్లికి ఎందుకు మార్పు చేయాల్సి వచ్చిందో అర్ధంకావటంలేదన్నారు.
బాపట్లకు ప్రాధాన్యం తగ్గే విధంగా పునర్విభజన
బాపట్ల జిల్లా నుంచి అద్దంకి నియోజకవర్గాన్ని తొలగించటం బాధాకరమన్నారు. 1982 సంవత్సరం నుంచి బాపట్ల జిల్లాను సాధించాలని తన తండ్రి కోన ప్రభాకర్ నుంచి తన వరకు ఏ సందర్భం వచ్చినా జిల్లా ప్రస్తావనతో ముందుకు నడిశామన్నారు. నీతి ఆయోగ్ ప్రాధాన్యతను చూసినప్పుడు సంతనూతలపాడు నియోజకవర్గం బాపట్ల జిల్లాలోకి రాలేదని కొద్దిపాటి ఆలోచన చేసినప్పటికి ఒంగోలుకు చుట్టుపక్కల ఉండటంతో అలా చేయాల్సి వచ్చిందని భావించామన్నారు. తాను మొదటి నుంచి పొన్నూరు, ప్రత్తిపాడు నియోజకవర్గాలను బాపట్ల జిల్లాలో చేర్చాలని కోరుతూనే ఉన్నానని కోన చెప్పారు. అద్దంకి తొలగిపోవటంతో ఆర్థికంగా బాపట్ల జిల్లా వెనుకబడిపోతుందని కోన అభిప్రాయపడ్డారు. ఆర్థికంగా బాపట్ల జిల్లా ముందు ఉండాలంటే పొన్నూరు, ప్రత్తిపాడు నియోజకవర్గాలను జిల్లాలో కలపాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు వినతిపత్రం అందిస్తామని కోన చెప్పారు. జిల్లాల పునర్విభజన సందర్భంగానైన ఆ రెండు నియోజకవర్గాలను బాపట్ల జిల్లాలో కలపాలని బలంగా తమ వాణి వినిపిస్తామని చెప్పారు. సమావేశంలో పార్టీ పట్టణ, మండల అధ్యక్షులు కాగిత సుధీర్‌బాబు, మరుప్రోలు ఏడుకొండలరెడ్డి, ఉయ్యూరు లీలాశ్రీనివాసరెడ్డి, నాయకులు గవిని కృష్ణమూర్తి, మోర్ల సముద్రాలగౌడ్, లక్ష్మీరాఘవ, అహ్మద్ హుస్సేన్, ఇమ్మడిశెట్టి శ్రీనివాసరావు, ఇనగలూరి మాల్యాద్రి, తన్నీరు అంకమ్మరావు తదితరులు ఉన్నారు.


